డిసెంబరుకల్లా లూమియా మూడు మోడళ్లు

9 Oct, 2015 02:32 IST|Sakshi
డిసెంబరుకల్లా లూమియా మూడు మోడళ్లు

మైక్రోసాఫ్ట్ మొబైల్స్ సేల్స్ డెరైక్టర్ శ్రీధర్
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఆవిష్కరించిన లూమియా 550, 950, 950 ఎక్స్‌ఎల్ మోడళ్లు డిసెంబరుకల్లా భారత్‌లో అందుబాటులోకి రానున్నాయి. విండోస్ 10 ఆధారంగా పనిచేసే ఈ మూడు 4జీ మోడళ్లను కంపెనీ న్యూయార్క్‌లో విడుదల చేసింది. 4.7 అంగుళాలున్న లూమియా 550 ధర భారత్‌లో రూ.10 వేలు ఉండే అవకాశం ఉంది. 1 జీబీ ర్యామ్, 1.1 గిగాహెట్జ్ ప్రాసెసర్, 5 ఎంపీ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ, 2,100 ఎంఏహెచ్ బ్యాటరీ ఇతర ఫీచర్లు.
 
 లూమియా 950 ఎక్స్‌ఎల్ ధర రూ.50 వేలు ఉండొచ్చు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్-4, అమోలెడ్ డిస్‌ప్లేతో 5.7 అంగుళాల స్క్రీన్, 2 గిగాహెట్జ్ ప్రాసెసర్, 3,340 ఎంఏహెచ్ బ్యాటరీ దీని ఫీచర్లు. లూమియా 950 మోడల్ 5.2 అంగుళాల స్క్రీన్‌తో కార్నింగ్ గొరిల్లా గ్లాస్-3, అమోలెడ్ డిస్‌ప్లేతో తయారైంది. ధర రూ.40 వేలు ఉండే అవకాశం ఉంది. ఈ రెండు మోడళ్లలోనూ 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమరీ, 20 ఎంపీ కెమెరా, 5 ఎంపీ ఫుల్ హెచ్‌డీ ఫ్రంట్ కెమెరా పొందుపరిచారు.
 ప్రధాన మార్కెట్లలో భారత్..
 
 ప్రపంచంలో ప్రముఖ 4జీ మార్కెట్లలో భారత్ ఒకటిగా నిలవనుందని మైక్రోసాఫ్ట్ మొబైల్ డివెసైస్ దక్షిణప్రాంత సేల్స్ డెరైక్టర్ టి.ఎస్.శ్రీధర్ తెలిపారు. లూమియా 640 ఎక్స్‌ఎల్ ఎల్‌టీఈ మోడల్‌ను గురువారమిక్కడ విడుదల చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. లూమియా 550, 950, 950 ఎక్స్‌ఎల్ స్మార్ట్‌ఫోన్లు రెండు నెలల్లో మార్కెట్లోకి వస్తాయన్నారు. జూలై 2014 నుంచి ఇప్పటి వరకు భారత్‌లో 11 మోడళ్లను విడుదల చేశామన్నారు. వీటిలో మైక్రోసాఫ్ట్ బ్రాండ్‌లో 8 మోడళ్లు తీసుకొచ్చామని తెలిపారు. సంస్థ వ్యూహంలో భాగంగానే పరిమితంగా మోడళ్లను ప్రవేశపెడుతున్నట్టు చెప్పారు. దీపావళికి డిస్కౌంట్లు ప్రకటిస్తామన్నారు.
 

మరిన్ని వార్తలు