ప్రాణాలు తీస్తున్న మిగ్ విమానాలు

15 Jul, 2013 19:39 IST|Sakshi
జోధ్పూర్ సమీపంలో కూలిన మిగ్-21

న్యూఢిల్లీ: మిగ్ విమానాలు సాక్షాత్తు యమధర్మరాజు మహిషాల్లా తయారయ్యాయి. వీటి గురించి ఎన్ని సార్లు ఎంత పెద్దస్థాయిలో ఆందోళనలు జరిగినా.. దాదాపు మరో నాలుగైదేళ్ల వరకు మిగ్ విమానాలను నడిపిస్తూనే ఉండేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం కొన్న మిగ్ విమానాల్లో సగానికి పైగా ఇప్పటికే ప్రమాదాల బారినపడి ఎందుకూ పనికిరాకుండా పోయాయి. మిగిలినవి కూడా అడపాదడపా కూలిపోతూ పైలట్ల ప్రాణాలను హరిస్తున్నాయి. తాజాగా సోమవారం రాజస్థాన్లో జరిగిన ప్రమాదంలో ఓ పైలట్ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. గతంలోనూ మిగ్ విమానాలు పదే పదే ప్రమాదాలకు గురవుతూ పైలట్ల ప్రాణాలు తీస్తూనే ఉన్నాయి. 2012 నవంబర్ నెలలో గుజరాత్లోని నాలియా ఎయిర్ బేస్లో కూడా వైమానిక దళానికి చెందిన మిగ్ 21 బైసన్ విమానం కూలిపోయింది.

కాలం చెల్లిన మిగ్ విమానాల కారణంగా జరుగుతున్న జరుగుతున్న ప్రమాదాలు, వాటిలో విలువైన ప్రాణాలు పోవడం అనే అంశాన్ని ఇతివృత్తంగా తీసుకుంటూ అమీర్ఖాన్ తదితరులు ''రంగ్ దే బసంతీ" చిత్రాన్ని రూపొందించారు. ఎంతోమంది సామాజిక కార్యకర్తలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. మృత్యువిహంగాలుగా మారుతున్న వీటి సేవలకు ఇక ముగింపు పలకాలని ఎన్నో విధాలుగా చెప్పి చూశారు. అయినా ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు.

2005 నుంచి 2010 ఆగస్టు వరకు 19 మిగ్-21 విమాన ప్రమాదాలు సంభవించగా, వాటిలో ఏడుగురు పైలట్లు మరణించారు. దీనిపై రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా పార్లమెంటు సభ్యులందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భారత్, చైనా సహా దాదాపు 20 దేశాల్లో ఈ మిగ్ విమానాలను తమ తమ వైమానిక దళాల్లో ఉపయోగిస్తున్నారు. మన దేశంలో మిగ్ 21, మిగ్ 27, మిగ్ 29 తరహా యుద్ధ విమానాలు వినియోగిస్తున్నారు. నావికాదళంలో కూడా ఐఎన్ఎస్ విరాట్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య విమానవాహక నౌకల్లో వినియోగించేందుకు ఇటీవలే మిగ్ 29 కె సిరీస్ విమానాలను భారత నౌకాదళం తీసుకుంది.  దేశీయ తయారీ తేలికపాటి యుద్ధవిమానాలు వైమానిక దళంలోకి రావడానికి ఇంకా సమయం పడుతుంది కాబట్టి సుమారు 2018-19 వరకు వీటిని కొనసాగించక తప్పేలా లేదు.

మరిన్ని వార్తలు