డ్రగ్స్‌ కేసులో డచ్‌ వ్యక్తి అరెస్ట్‌

27 Jul, 2017 00:59 IST|Sakshi
డ్రగ్స్‌ కేసులో డచ్‌ వ్యక్తి అరెస్ట్‌
- 2.8 గ్రాముల డీఎంటీ డ్రగ్‌ స్వాధీనం  
- కెల్విన్‌కు డ్రగ్స్‌ సరఫరా చేసింది ఇతడే!
- నెదర్లాండ్స్‌ నుంచి ఇప్పటిదాకా నాలుగుసార్లు భారత్‌కు వచ్చాడు: అకున్‌
 
సాక్షి, హైదరాబాద్‌: కెల్విన్‌కు డ్రగ్స్‌ సరఫరా చేసిన ఓ కీలక వ్యక్తిని ఎక్సైజ్‌ సిట్‌ అధికారులు బుధవారం అరెస్ట్‌ చేశారు. నెదర్లాండ్స్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మైక్‌ కమింగ.. కెల్విన్‌కు డ్రగ్స్‌ సరఫరా చేసినట్టు ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ తెలిపారు. ఇతడు నాలుగు సార్లు భారత్‌కు వచ్చాడని, అందులో రెండుసార్లు హైదరాబాద్‌కు వచ్చినట్టు వివరించారు. అతడి నుంచి 2.8 గ్రాముల డీఎంటీ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నట్టు బుధవారం మీడియాకు వెల్లడించారు.
 
టెకీలకు అలవాటు చేశాడా?
కెల్విన్‌ ముఠాతో చేతులు కలిపి మైక్‌ కమింగ హైదరాబాద్‌లోని పలు సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో పనిచేస్తున్న టెకీలకు డ్రగ్స్‌ సరఫరా చేశాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. పదేపదే కెల్విన్‌ కాల్‌డేటాలో కమింగ నంబర్లు, వాట్సాప్, తదితర సోషల్‌ మీడియా ద్వారా డ్రగ్స్‌ వ్యవహారంపై సంభాషణలున్నట్టు సిట్‌ గుర్తించింది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు డార్క్‌నెట్‌లో డ్రగ్స్‌ ఆర్డర్‌ ఇస్తే వారి అడ్రస్‌లకు కమింగ కొరియర్ల ద్వారా పంపించి ఉంటాడన్న కోణంలో సిట్‌ దర్యాప్తు చేస్తోంది. వందల మంది టెకీలు డ్రగ్స్‌ తీసుకుంటున్నట్టు ఇప్పటికే సిట్‌ అనుమానిస్తోంది.
 
హైదరాబాద్‌ యువతితో వివాహం: నెదర్లాండ్‌లో స్థిరపడిన హైదరాబాదీ శిల్ప అలియాస్‌ మేరీని మైక్‌ వివాహం చేసుకున్నట్టు సిట్‌ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌కు చెందిన దేవదాస్, నళిని దంపతుల కుమార్తె ఉన్నత విద్యాభ్యాసం చేసి నెదర్లాండ్స్‌లోనే సెటిల్‌ అయినట్టు అధికారులు తెలిపారు. మేరీ ద్వారా ఉన్న పరిచయాలతో హైదరాబాద్‌లో పలువురితో మైక్‌ స్నేహం చేసినట్టు తెలుస్తోంది. అతడు పలు సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో ఇన్‌స్టలేషన్, నూతన విధానాలను పరిచయం చేయడం వంటి పనులు చేస్తుంటాడని సిట్‌ విచారణలో తేలింది. మార్చిలో శిల్ప తల్లి మృతి చెందండటంతో మైక్‌ హైదరాబాద్‌ వచ్చాడు. ఆ సందర్భంలో పలువురు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు మైక్‌ను కలిసినట్టు సమాచారం. మైక్‌ మొబైల్‌లో హైదరాబాద్‌కు చెందిన వందల మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ల నంబర్లు ఉండటం గమనార్హం.
Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా