పెండింగ్ ప్రాజెక్టులకు నిధులివ్వండి

4 Nov, 2015 02:05 IST|Sakshi
పెండింగ్ ప్రాజెక్టులకు నిధులివ్వండి

♦ కేంద్ర మంత్రి ఉమాభారతికి మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి
♦ {పాణహితకు జాతీయ హోదా ప్రకటించాలని వినతి
♦ మిషన్ కాకతీయ రెండో దశ ప్రారంభోత్సవానికి ఆహ్వానం
 
 సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఏడు జలవనరుల ప్రాజెక్టులకు వెంటనే నిధులు విడుదల చేయాలని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమా భారతికి విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా ప్రాణహిత ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని కోరారు. మంగళవారం ఢిల్లీలో టీఆర్‌ఎస్ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్, ప్రభాకర్‌రెడ్డి, నీటిపారుదలశాఖ సలహాదారు విద్యాసాగర్‌రావు, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రు తెజావత్‌లతో కలసి ఉమాభారతితో సమావేశమైన హరీశ్‌రావు ఈ మేరకు ఆమెకు వినతిపత్రం అందించారు.

అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మిషన్ కాకతీయకు సంబంధించి రూ.428 కోట్లు, నిజాంసాగర్ ఆధునీకరణకు రూ.978 కోట్లు, మోడికుంట వాగు ప్రాజెక్టుకు రూ.456 కోట్ల పెండింగ్ నిధులను విడుదల చేయాలని ఉమా భారతిని కోరామన్నారు. అలాగే వరంగల్ జిల్లాలో చేపట్టిన చొక్కారావు దేవాదుల ప్రాజెక్టుకు గత మూడేళ్ల పెండింగ్ నిధులతోపాటు ఈ ఏడాది రావాల్సిన నిధులు మొత్తం రూ.400 కోట్లను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో ఫ్లడ్ ఫ్లో కెనాల్ ప్రాజెక్టుకు రూ. 5,887 కోట్ల సవరణ వ్యయంపై కేంద్ర జలవనరుల సంఘానికి పంపిన పరిపాలన మంజూరీని ఆమోదించి నిధులు విడుదల చేయాలని విన్నవించామన్నారు.

రాష్ట్రంలో 42 మండలాల్లో భూగర్భ జలాలను పెంచడానికి రూ. 736 కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టుకు మంజూరి ఇవ్వాలని కోరామన్నారు. తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం రెండో దశ ప్రారంభోత్సావానికి రావాల్సిందిగా ఉమా భారతిని ఆహ్వానించినట్టు హరీశ్ చెప్పారు. మిషన్ కాకతీయకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులివ్వాలన్నారు. ప్రాణహిత ప్రాజెక్టులో చేసిన మార్పుచేర్పులతో కూడిన నివేదికను త్వరలోనే కేంద్రానికి సమర్పించనున్నామని హరీశ్ చెప్పారు. జలవనరుల శాఖ బడ్జెట్ పెంపుపై ప్రధాని మోదీతో మాట్లాడతానని ఉమా భారతి హామీ ఇచ్చినట్లు హరీశ్ తెలిపారు.

ప్రస్తుతం అమల్లో ఉన్న పథకాలను ముందుకు తీసుకెళ్లడం, కేంద్ర రాష్ట్రాల మధ్య పరస్పర సహకార సంబంధాలను మెరుగుపర్చుకోవడం, పెం డింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి త్వరలోనే రాష్ట్ర సాగునీటిశాఖల మంత్రులు, కార్యదర్శులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తామని ఉమా భారతి చెప్పారన్నా రు. తెలంగాణకు న్యాయమైన నీటి వాటా కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. కృష్ణా జలాల కేటాయింపు అంశంపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను హరీశ్ ప్రస్తావిస్తూ ‘‘ఏడాదిలోపు కేంద్రం నిర్ణయం తీసుకోనప్పడు ఆ ప్రభుత్వం ఇచ్చిన పిటిషన్‌ను ట్రిబ్యునల్‌కు పంపాలి. ట్రిబ్యునల్ ద్వారా మళ్లీ నీటి కేటాయింపులు చేపట్టాలని గతంలో తీర్పులున్నాయి. న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకం ఉంది. తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది’’ అని పేర్కొన్నారు.
 
 గోదాముల నిర్మాణానికి సబ్సిడీ ఇవ్వాలి
 రాష్ట్రంలో 1,024 కోట్ల వ్యయంతో 17 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంగల గోదాములు నిర్మిస్తున్నామని...ఇందుకుగాను తమ ప్రభుత్వానికి 25 శాతం సబ్సిడీ ఇవ్వాలని కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి సిరాజ్ హుస్సేన్‌ను కలసి కోరినట్లు హరీశ్ చెప్పారు. అలాగే కేంద్రం, రాష్ట్రం ఉమ్మడి భాగస్వామ్యంతో రైతులకు భారం లేకుండా పంట బీమా పథకంలో తక్కువ ప్రీమియం వసూలు చేయాలని, కరువు మండలాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశామన్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు చేయాలని, రూ. 212 కోట్లు నిధులు విడదుల చేయాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీశాఖ కార్యదర్శి బృందా స్వరూప్‌ను కలసి కోరామన్నారు.

మరిన్ని వార్తలు