ఏపీ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాలు

16 Nov, 2016 03:43 IST|Sakshi
ఏపీ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాలు

మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపణ
 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లో భారీ వ్యయంతో విద్యుత్ ప్రాజెక్టులను నిర్మిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో 800 మెగావాట్ల కొత్తగూడెం థర్మల్ విద్యుత్ ప్లాంట్‌ను రూ.3,810 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నామని... అదే 800 మెగావాట్ల చొప్పున సామర్థ్యం గల ఏపీలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ ప్లాంట్‌ను రూ.4,606.87 కోట్లు, దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్-2ను రూ.4,967 కోట్ల అంచనాతో నిర్మిస్తున్నారన్నారు. తెలంగాణతో పోల్చితే నార్ల తాతారావు ప్లాంట్‌పై రూ.796.87 కోట్లు, దామోదరం సంజీవయ్య ప్లాంట్‌పై రూ.1,157 కోట్లను ఏపీ అధికంగా ఖర్చు చేస్తోందన్నారు.

ఈ డబ్బులను ఎవరికి ధారాదత్తం చేస్తున్నారో.. దీని వెను క ఏ మతలబు ఉందో తెలపాలని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అరుున బీహెచ్‌ఈఎల్ నుంచి కూడా వాటాలు పొందవచ్చని 30 ఏళ్ల రాజకీయ అనుభవంగల వారికే బాగా తెలుసని ఏపీ సీఎం చంద్రబాబుపై పరోక్ష ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తెలంగాణ ట్రాన్‌‌సకో, జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు, డిస్కంల సీఎండీలు జి.రఘుమారెడ్డి, ఎ.గోపాలరావుతో కలసి మంగళవారం జగదీశ్‌రెడ్డి సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్లు, ప్రాజెక్టుల నిర్మాణంపై టీటీడీపీ కార్యనిర్వహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.

 ప్రైవేటు ఒప్పందం ఎందుకు?
 మిగులు విద్యుత్ సాధించామని ప్రకటించుకున్న ఏపీ ప్రభుత్వం మీనాక్షి నుంచి 200 మెగావాట్లు, సింహపురి నుంచి 400 మెగావాట్ల ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లకు ఒప్పందం ఎందుకు కుదుర్చుకుందని జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణకు 392 మెగావాట్ల మిగులు విద్యుత్‌ను ఇస్తామని ఆఫర్ ఇచ్చిన ఏపీ ఆ తర్వాత వెనక్కితగ్గి మరోసారి మోసం చేసిందన్నారు. రిటైర్డ్ అధికారులను సీఎండీలుగా నియమించడాన్ని కూడా తప్పుపడుతున్నారని, ఈ అధికారులే గత రెండేళ్లుగా రాత్రింబవళ్లు పనిచేయడంతో రాష్ట్రంలో విద్యుత్ సమస్య పరిష్కారమైందన్నారు. దేశ వ్యాప్తంగా 36 సబ్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ ప్లాంట్లు నిర్మాణంలో ఉన్నాయని, మణుగూరులో నిర్మిస్తున్న భద్రాద్రి 1,080 మెగావాట్ల సబ్‌క్రిటికల్ ప్లాంట్‌కు సైతం కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
 
 ప్రజల కోసం పనిచేసేవారు జైలుకెందుకు వెళతారు?
 భద్రాద్రి ప్లాంట్ విషయంలో జరిగిన వ్యవహారాల్లో అధికారులు జైలుకు వెళ్లే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని కొందరు ఆరోపిస్తున్నారని, ప్రజల కోసం పనిచేస్తున్న అధికారులు జైలుకు వెళ్లాల్సిన అవసరం ఏముంటదని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ప్రైవేటు కొనుగోళ్లు, విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని అత్యంత పారదర్శకంగా చేపట్టామని వెల్లడించారు. వీటిపై చర్చకు సీఎండీలు, డీఈలు అవసరం లేదని, తమ లైన్‌మెన్లు సరిపోతారని, వారితో చర్చకు విపక్షాలు ముందుకు రావాలని సవాలు విసిరారు. పెద్ద నోట్ల రద్దు వల్ల రాష్ట్రంపై పడే ప్రభావాన్ని సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నారని, పూర్తి స్థారుులో అవగాహనకు వచ్చిన తర్వాత స్పందిస్తామన్నారు.

మరిన్ని వార్తలు