'సీఎం చాలా పద్ధతిగా చెప్పారు'

1 Oct, 2015 13:31 IST|Sakshi
'సీఎం చాలా పద్ధతిగా చెప్పారు'

హైదరాబాద్: రైతాంగ సమస్యలపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శించారు. అన్నదాతలకు తమ ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని చెప్పారు. గురువారం ఆయన మీడియా మాట్లాడుతూ విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో రైతు సమస్యలపై 11 గంటల 56 నిమిషాలు గంటల పాటు చర్చించామని, ఇందులో 6 గంటల 23 నిమిషాలు విపక్ష సభ్యులే మాట్లాడారని వెల్లడించారు. తమ కంటే ప్రతిపక్ష సభ్యులే ఎక్కువగా మాట్లాడినా ఓపిగ్గా విన్నామని చెప్పారు.

'ప్రతిపక్షాలు చేసిన డొల్ల వాదనను సీఎం కేసీఆర్ చీల్చిచెండాడొచ్చు. 60 ఏళ్ల మీ దౌర్భగ్య చరిత్రను ఏకీపారేయొచ్చు. కానీ గౌరవనీయ ముఖ్యమంత్రి చాలా పద్ధతిగా చెప్పే ప్రయత్నం చేస్తే వన్ టైమ్ సెటిల్ మెంట్ అన్న ఏకైక ఎజెండాతో సభను అడ్డుకున్నారు. విపక్షాల తీరు శవాలపై పేలాలు ఏరుకునే తీరులో ఉంది. మా ప్రభుత్వానికి పెరుగుతున్న ఆదరణ చూడలేక రోడ్డెక్కి రచ్చ చేస్తున్నారు. సిద్ధాంతాలు పక్కనపెట్టి రాద్ధాంతం చేస్తున్నారు' అని కేటీఆర్ ధ్వజమెత్తారు. రైతులను ఆదుకోడంలో తమ ప్రభుత్వం ముందు ఉంటుందని, దీనిపై అనవసర రాజకీయాలు తగవని అన్నారు.

మరిన్ని వార్తలు