మంత్రి నారాయణను బర్తరఫ్ చేయాలి

19 Aug, 2015 01:05 IST|Sakshi

విద్యార్థి సంఘాల డిమాండ్    
నేడు విద్యాసంస్థల బంద్‌కు పిలుపు

 
కడప/కర్నూలు/అనంతపురం/తిరుచానూరు: వైఎస్సార్ జిల్లా కడప శివారులోని నారాయణ జూనియర్ కళాశాలలో మనీషా, నందిని ఆత్మహత్య ఘటనలో మంత్రి నారాయణను బర్తరఫ్ చేయాలని విద్యార్థి, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. మంగళవారం రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో పలు విద్యాసంఘాలు ఆందోళన చేపట్టాయి. వైఎస్సార్ జిల్లాలో ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్, ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నాలు, దిష్టిబొమ్మల దహనాలు కొనసాగాయి. కడపలో వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. నారాయణను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.  

 వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం సంఘీభావం
నిబంధనలకు విరుద్ధంగా కళాశాలల్ని నడుపుతున్న ప్రైవేటు కాలేజీల తీరుకు నిరసనగా ఈ నెల 19వ తేదీన ఏఐఎస్‌ఎఫ్ (అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్) పిలుపు నిచ్చిన విద్యా సంస్థల రాష్ట్ర బంద్‌కు వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం సంఘీభావం ప్రకటించింది. వైఎస్సార్ కడప జిల్లాలోని నారాయణ కళాశాల హాస్టల్‌లో ఇద్దరు ఇంటర్ విద్యార్థినులు ఆత్మహత్యలు చేసుకోవడం సహా గత ఏడాది కాలంలో నారాయణ సంస్థల్లో పదుల సంఖ్యలో సంభవించిన మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయని విద్యార్థి విభాగం అధ్యక్షుడు షేక్ సలాంబాబు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.  ఇంత జరుగుతున్నా రాష్ట్రప్రభుత్వం స్పందించక పోవడం దారుణమని విమర్శించారు. విద్యార్థుల మరణాలకు ఎవరు కారకులో తేల్చాలని కోరారు. తాము బంద్‌కు మద్ధతిస్తున్నట్లు ప్రకటించారు.
 
 

మరిన్ని వార్తలు