చట్టసభల్లో సిత్రాలు

20 Feb, 2014 10:40 IST|Sakshi

చట్టసభలలో మల్లయుద్ధాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ, పార్లమెంటు ఏదైనా సరే, సభ్యులు సహనం కోల్పోతున్నారు. బలప్రయోగాలు చేస్తున్నారు. అడ్డు వచ్చినవారిని, తమకు అడ్డంగా ఉన్నారనుకున్న వాళ్లను తోసేయడం, గట్టిగా మాట్లాడితే లెంపకాయలు ఇచ్చుకోవడం, మరీ కాదనుకుంటే చొక్కాలు విప్పి అర్ధనగ్నంగా నిలబడటం.. ఇలాంటి వేషాలు వేస్తున్నారు. అవేంటో ఒక్కసారి చూద్దామా..

మార్షల్ చెంప చెళ్లుమనిపించి..
 జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో పీడీపీ ఎమ్మెల్యే సయ్యద్ బషీర్ మార్షల్‌పై చేయి చేసుకున్నారు. బుధవారం వ్యవసాయరంగానికి నిధుల కేటాయింపులపై సభలో చర్చ జరుగుతోంది. అదే సమయంలో తన నియోజకవర్గంలో వలసదారుల (కాశ్మీరీ పండిట్లు)కు రేషన్ సరుకుల కొరతపై నిరసన వ్యక్తం చేస్తూ బషీర్ వెల్‌లోకి దూసుకుపోయారు. ఆయనను నిలువరించాలని స్పీకర్ ముబారక్‌గుల్ మార్షల్స్‌ను ఆదేశించారు. దాంతో మార్షల్స్ బషీర్‌ను బయటకు తీసుకెళుతుండగా.. ఆయన ఒక మార్షల్ కాలర్ పట్టుకుని మూడుసార్లు చెంపపై కొట్టారు.
 
  చొక్కా విప్పేసుకొని...

 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో ఇద్దరు రాష్ట్రీయ లోక్‌దళ్ ఎమ్మెల్యేలు హల్‌చల్ సృష్టించారు. ప్రభుత్వం చెరకు రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదంటూ చొక్కాలు విప్పేసుకుని నిరసన తెలిపారు. 2014-15 మధ్యంతర బడ్జెట్‌ను ఆమోదించడానికి అసెంబ్లీ సమావేశాలు బుధవారమే మొదలయ్యాయి. ఉదయం 11 గంటలకు గవర్నర్ బీఎల్ జోషి అసెంబ్లీ, శాసన మండళ్ల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగం ప్రారంభించగానే రభస మొదలైంది. బీఎస్పీ సభ్యులు బెంచీలపెకైక్కి బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు.  ఆ సమయంలో ఆరెల్డీకి చెందిన వీర్‌పాల్, సుదేష్ శర్మలు వెల్‌లోకి దూసుకెళ్లి చెరకు రైతుల సమస్యపై సర్కారు తీరును నిరసిస్తూ కుర్తాలు విప్పేసుకున్నారు.
 
  పశ్చిమ యూపీలోని చెరకు రైతులకు ప్రభుత్వం బకాయిలు చెల్లించడం లేదని, ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆరోపించారు.  రగడ మధ్య గవర్నర్ ప్రసంగం సరిగ్గా వినబడలేదు. దీంతో ఆయన నాలుగు నిమిషాల్లోనే ప్రసంగం ముగించి వెళ్లిపోగా సభ మధ్యాహ్నం 12.30 గంటలకు వాయిదా పడింది. తిరిగి మొదలవగానే స్పీకర్ మతాప్రసాద్ పాండే గవర్నర్ ప్రసంగ పాఠాన్ని చదివేందుకు ప్రయత్నించగా విపక్షనేత స్వామి ప్రసాద్ మౌర్య(బీఎస్పీ) అభ్యంతరం చెప్పారు. విపక్షాల నినాదాల మధ్య సభ గురువారానికి వాయిదా వేశారు. సభ వాయిదా పడ్డాక మంత్రి ఆజమ్ ఖాన్ విలేకర్లతో మాట్లాడుతూ చొక్కాలు విప్పిన ఆరెల్డీ ఎమ్మెల్యేలు ప్యాంట్లు కూడా విప్పేసుకుని ఉండాల్సిందని అన్నారు.
 
వీరంగం వేసి...
రాజ్యసభలో బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లును తీసుకువచ్చే సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాయిదా అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు సభ ప్రారంభమైన తర్వాత సెక్రటరీ జనరల్.. లోక్‌సభ ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లును సభ ముందు ఉంచుతున్నానంటూ చదువుతుండగా.. ఆ పత్రాలను లాక్కునేందుకు టీడీపీ ఎంపీ సి.ఎం.రమేశ్ తీవ్రంగా ప్రయత్నించారు. ఈ సందర్భంలోనే రమేశ్ చేయి సెక్రటరీ జనరల్ ముఖాన్ని తాకింది. రమేశ్ తీరుపై డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం భావోద్వేగంలో అలా జరిగిందంటూ రమేశ్ క్షమాపణలు చెప్పారు.

మరిన్ని వార్తలు