బ్యాంక్ గ్యారంటీ లేకుండా మైనార్టీలకు రుణాలు

29 Aug, 2015 01:32 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ  ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకం కింద నిరుద్యోగ మైనార్టీలకు ఎలాంటి బ్యాంక్ గ్యారంటీ (పూచీకత్తు)లు లేకుండా రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకర్లు రాష్ట్ర మైనార్టీ కమిషన్‌కు హమీ ఇచ్చారు. శుక్రవారం రాజ్‌భవన్ రోడ్‌లోని రాష్ట్ర మైనార్టీస్ కమిషన్ కార్యాలయంలో  మైనార్టీ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు  తీరుతెన్నులపై బ్యాంకర్లతో సమీక్షా సమావేశం జరిగింది. మైనార్టీ వర్గాలకు  కేంద్ర శిశు పథకం కింద చిన్నతరహా వ్యాపారానికి రూ.50 వేల వరకు, కిశోర పథకం కింద మధ్యతరహా వ్యాపారానికి  రూ.50 వేల నుంచి ఐదు లక్షల వరకు, తరుణ్ పథకం కింద పెద్ద పరిశ్రమల స్థాపన కోసం రూ.ఐదులక్షల నుంచి పది లక్షల వరకు రుణాలు అందించేందుకు బ్యాంకులు అంగీకరించాయి.

అదేవిధంగా విదేశీ విద్యాభాసం కోసం ఎలాంటి బ్యాంకు గ్యారంటీ లేకుండా రూ.4 లక్షల వరకు ఇవ్వనున్నాయి. ఇద్దరి పూచీకత్తులపై రూ. 4 లక్షల నుంచి రూ.7లక్షల వరకు ఇస్తాయి. రూ.7 లక్షలపైగా రుణాల కోసం మాత్రం తగిన గ్యారంటీ అవసరమని స్పష్టం చేశాయి. విద్యార్థుల కోసం జీరో ఖాతాల నిర్వహణకు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
 
జిల్లా స్థాయిలో  కార్యక్రమాలు

రాష్ట్రంలో మైనార్టీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పథకాల్లో ప్రోత్సహించేందుకు సెప్టెంబరులో జిల్లా స్థాయిలో కార్యక్రమాలు, రుణ మేళాలు నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. బ్యాంకింగ్ రుణాలపై ప్రత్యేక బుక్ లెట్ రూపొందించి విస్తృతంగా ప్రచారం కల్పించాలని తీర్మానించారు. అదేవిధంగా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలని,  లీడ్ బ్యాంక్‌లో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాని నిర్ణయించారు.రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ అబీద్ రసూల్ ఖాన్ అధ్యక్షతన  జరిగిన సమావేశంలో కమిషన్ సభ్యులు గౌతమ్ జైన్, సర్దార్ సుర్జీత్ సింగ్, ఇటాలియా,  వివిధ జాతీయ బ్యాంకుల డీజీఎం, ఏజీఎం, సీనియర్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు