బేబీ విదిశ.. ఓ అద్భుతం..

11 May, 2017 16:18 IST|Sakshi

ముంబై: నిజంగా ఈ పాప  మిరాకిల్‌ బేబీనే.. ఎందుకంటే.. పుట్టుకతోనే మేజర్‌ హార్ట్‌ ప్రోబ్లమ్‌.12గంటల నిరంతరాయమైన ఆపరేషన్‌.. ఆరుసార్లు గుండెపోటు. అయినా  వైద్యశాస్త్రాన్నే అబ్బురపరుస్తూ అద్భుతంగా కోలుకుంది. పూర్తి ఆరోగ్యంతో మరో రెండు  రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్చ్‌ కానుంది.

వివరాల్లోకి వెళితే క‌ల్యాణ్‌కు చెందిన విశాక‌, వినోద్ ల మొదటి సంతానం విదిశ.  ఆ పాప 45 రోజుల వ‌య‌సులో ఉన్నపుడు  తల్లి పాలు తాగి  వాంతి చేసుకుంది. అకస్మాత్తుగా  స్పృహ కోల్పోయింది.  దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు   బిడ్డను వెంటనే బిడ్డను స్థానిక నర్సింగ్ హోమ్‌కు  తరలించారు. వారు  ముం‍బైలోని  బీజే వాడియా ఆసుప‌త్రికి రెఫ‌ర్ చేశారు. పాప అరుదైన గుండె సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్నట్టు పరీక్షల్లో తేలింది.  ట్రాన్స్‌పొజిషన్‌ ఆఫ్‌ గ్రేట్‌ ఆర్టరీస్‌ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు. డా. బిశ్వా పాండా గుర్తించారు.  ఇందుకు  12 గంట‌ల స‌ర్జరీ అవ‌స‌ర‌మ‌ని తేల్చారు. 
మార్చి 14న  ఆపరేషన్‌ జరిగింది.  కానీ ఇంతలోనే మ‌రో కొత్త స‌మ‌స్య మొద‌లైంది. గుండె ప‌నితీరు మెరుగైనా.. బ‌ల‌హీనంగా ఉన్న ఆమె ఊపిరితిత్తులు ఇబ్బంది పెట్టాయి. ఇలాంటి కేసుల్లో పుట్టగానే గుండెకు స‌ర్జరీ నిర్వహించాలనీ,  అలా చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల ఇంత‌కుముందు వ్యవస్థకే ఊపిరితిత్తులు అల‌వాటు ప‌డ్డాయ‌ని డా. పాండా గుర్తించారు.  ర‌క్తంలో ఆక్సిజ‌న్ స్థాయి హ‌ఠాత్తుగా పడిపోయేది. కార్బన్‌ డైఆక్సైడ్ మూడు రెట్లు పెరిగేది. ఫలితంగా విదిశకు ఆరుసార్లు గుండెపోటు వ‌చ్చింది. హైఫ్రీక్వెన్సీ వెంటిలేట‌ర్ సాయంతో ఆమెకు చికిత్స  అందించారు.  51 రోజుల పాటు ఆ చిన్నారి ఐసీయూలోనే ఉంది. మొత్తానికి రెండు నెల‌ల త‌ర్వాత ఆ పాప కోలుకుంది. దీంతో ఇపుడు  మిరాకిల్ బేబీగా  నిలిచింది.
అంతేకాదు విదిశ తల్లిదండ్రులు పేదవాళ్లు. కేవలం రూ.25వేల ఫీజు మాత్రమే చెల్లించే స్థితిలో వారున్నారు. అయితే మొత్తం రూ.5 లక్షల బిల్లును ఆసుప‌త్రిలోని పలు దాతలు చెల్లించడం  విశేషం.  

కాగా  బి.జె.వాడియా హాస్పిటల్ సిఇఓ డాక్టర్ మిన్నీ బోదాన్వాలా మాట్లాడుతూ గుండె జబ్బులతో బాధపడుతున్న పిల్లలకు సహాయం చేయడానికి కార్డియాక్ సర్జరీ విభాగానికి మూడు సంవత్సరాలపాటు తాము  కృషి చేస్తున్నామని, తమ లక్ష్యం ఇప్పటికి నెరవేరిందంటూ సంతోషం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు