ముంబైలో ‘అనూహ్య’ హత్య

18 Jan, 2014 07:57 IST|Sakshi
అనూహ్య మృతదేహాన్ని స్వగ్రామానికి తరలిస్తున్న దృశ్యం. అనూహ్య(ఇన్సెట్లో)

* సంచలనం సృష్టిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
* పదకొండు రోజుల తర్వాత కనిపించిన మృతదేహం
* బలమైన ఆయుధంతో కొట్టి చంపారంటున్న పోలీసులు
* రైలు దిగిన తర్వాత ఎక్కడికి వెళ్లింది?
* ఎవరు హత్యకు పాల్పడ్డారు?
 
సాక్షి, విజయవాడ/ముంబై: ‘నాన్నా.. పొద్దున ట్రెయిన్ దిగగానే ఫోన్ చేస్తా..!’ తెల్లారింది కానీ ఫోన్ రాలేదు.. గంటలు గడిచిపోయాయి.. తల్లిదండ్రుల్లో టెన్షన్! అమ్మాయి ఎక్కడుందోనన్న ఆందోళన.. ఏమైపోయిందోనన్న భయంతో పోలీసులకు ఫిర్యాదు.. 11 రోజులు గడిచిపోయాయి.. అయినా కూతురు క్షేమంగానే ఉంటుందని తల్లిదండ్రుల్లో ఆశ.. ఇంతలోనే షాక్..  దారుణ హత్యకు గురై, గుర్తుపట్టేందుకు వీల్లేని స్థితిలో ముంబైలో అమ్మాయి మృతదేహం!!
 
కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఎస్తేర్ అనూహ్య(23) హత్య సంచలనం సృష్టిస్తోంది. ఆమె ముంబైలో రైలు దిగిన తర్వాత ఏం జరిగింది? ఎక్కడికి వెళ్లింది? ఎవరు హత్య చేశారు? చంపేసి ఎందుకు తగులబెట్టారు? ప్రస్తుతానికి ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలే. ఈ నెల 4న విజయవాడలో లోక్‌మాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరిన అనూహ్య.. 16న (గురువారం సాయంత్రం) ముంబైలోని కుంజూర్ మార్గ్ వద్ద శవంగా కనిపించిన విషయం తెలిసిందే.
 
ప్రయాణికులు ఏం చెప్పారు?
గత ఏడాది క్యాంపస్ సెలక్షన్‌లో ఎంపికైన అనూహ్య ముంబైలోని టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ఇద్దరు స్నేహితురాళ్లతో కలసి అంధేరీలోని వైడబ్ల్యూసీఏ హాస్టల్‌లో ఉంటోంది. క్రిస్మస్ సెలవుల కోసం మచిలీపట్నానికి వచ్చిన ఆమె ఈనెల 4న ముంబై బయల్దేరింది. నాలుగో తేదీ రాత్రి 10 గంటల సమయంలో మహారాష్ట్రలోని షోలాపూర్ చేరుకున్నానని, ఉదయం హాస్టల్‌కు వెళ్లగానే ఫోన్ చేస్తానని తండ్రి జోనతమ్ సురేంద్రప్రసాద్‌కు చెప్పింది. అయితే తెల్లారి ఆమె నుంచి ఫోన్ రాకపోవడంతో తల్లిదండ్రులు ప్రసాద్, జ్యోత్స్న కంగారు పడ్డారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ అని రావడంతో అదే రోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆమె మేనమామ విజయవాడ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రి ప్రసాద్ కూడా ముంబై వెళ్లి కుర్లా రైల్వే స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న విజయవాడ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమెతో పాటు ప్రయాణించిన వారి వివరాలను తెప్పించి వారితో మాట్లాడారు. అనూహ్య ఎస్-5 బోగీ లో 47వ బెర్త్‌లో ప్రయాణం చేసినట్లు తేలింది. బెర్త్ నం 41, 43, 45లలో ప్రయాణించిన వారితో పోలీసులు మాట్లాడారు. 45వ నంబర్ బెర్త్‌ల్లో ప్రయాణించిన హరిబాబు పుణేలో దిగిపోయారు. ఆయన రైలు దిగే సమయానికి అనూహ్య తన బెర్త్‌లో నిద్రపోతోందని చెప్పారు. మిగిలిన బెర్త్‌లలో ప్రయాణిస్తున్న రఘునాథ్, సుహాసిని దంపతులు అనూహ్యతోపాటు ముంబై వరకూ ప్రయాణించారు. ఉదయం 5.30 గంటలకు రైలు ముంబైలో అగినపుడు అనూహ్య కూడా దిగిందని వారు చెప్పారు.

‘అమ్మా నీ కోసం ఎవరైనా వస్తున్నారా? మాతో వస్తావా’ అని అడిగితే తనకు అలవాటేనని, వెళ్లిపోతానని అనూహ్య సమాధానం చెప్పిందని రఘునాథ్ పోలీసులకు చెప్పారు. ఆ తర్వాత ఏమైందన్నదే మిస్టరీగా మారింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో హేమంత్ అనే స్నేహితుడు అనూహ్యకు ఆహార ప్యాకెట్స్ తెచ్చి అందించారు. ఆ తర్వాత అతను సికింద్రాబాద్ నుంచి వేర్వేరు ప్రాంతాలకు వెళ్లడం, ఫోన్ చేసినా సరిగ్గా స్పందించకపోవడంతో అతని పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ముంబైలో కూడా అనూహ్యతో పనిచేస్తున్న రాజశేఖర్ అనే వ్యక్తి పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
 
బలమైన ఆయుధంతో కొట్టి చంపారు..
అనూహ్యను దుండగులు బలమైన ఆయుధంతో కొట్టి హత్య చేసినట్లు ముంబై పోలీసులు వెల్లడించారు. ఆమె దేహం, మర్మావయవాలపైనా గాయాలున్నట్లు వైద్య పరీక్షల్లో తేలినట్లు చెప్పారు. లైంగిక దాడికి గురైనట్లు అనుమానిస్తున్నారా అని అడగ్గా.. ఫోరెన్సిక్ నివేదిక తర్వాతే ఈ విషయం తేలుతుందన్నారు.
 
ముంబై పోలీసుల నిర్లక్ష్యం..
కేసు దర్యాప్తులో ముంబై పోలీసులు తీవ్ర అలసత్వం ప్రదర్శించారని అనూహ్య తండ్రి ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతసేపూ అమ్మాయికి ఎవరితో పరిచయాలు ఉన్నాయన్న అంశంపైనే వారు దృష్టి పెట్టారని, ముంబైలో అసాంఘిక శక్తుల బారిన పడిందన్న కోణంలో దర్యాప్తు చేయలేదని చెప్పారు. ఫిర్యాదు చేసిన వెంటనే ఈ దిశగా విచారణ జరిపి ఉంటే అనూహ్య తమకు దక్కేదని కన్నీళ్ల పర్యంతమయ్యారు. ముంబై పోలీసులు ఏ మాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని హుజూర్‌నగర్‌లో ఉంటున్న అనూహ్య మామ బీఎస్‌జే మనోహర్ తెలిపారు.

విషయం తెలియగానే తాము తొలుత ముంబైలోని ఎంఐడీసీ పోలీసుస్టేషన్‌కు వెళ్లామని, అయితే వారు కుర్లా స్టేషన్‌కు వెళ్లమని సూచించారని, అక్కడికి వెళ్తే వారు చాలా తేలిగ్గా తీసుకొని, ముందుగా విజయవాడ రైల్వే స్టేషన్‌లో కేసు పెట్టాలని చెప్పినట్లు ముంబైలో ఉంటున్న సునీత వివరించారు. రాష్ట్ర డీజీపీని కలిసి ముంబై పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చినా ఫలితం లేకుండా పోయిందని, అంధేరి పోలీసులు ఎలాంటి సహకారం అందించలేదని, స్థానిక ఆటోడ్రైవర్ల సహాయంతో అనూహ్య మృతదేహాన్ని కనుగొన్నామని సికింద్రాబాద్‌లో ఉంటున్న ఆమె చినతాత ఇమ్మానుయేల్ చెప్పారు.
 
నేడు అంత్యక్రియలు
అనూహ్య మృతదేహానికి శుక్రవారం పోస్టుమార్టం పూర్తికావడంతో శుక్రవారం రాత్రి 10 గంటలకు అనూహ్య మృతదే హాన్ని బంధువులు ముంబై నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తీసుకువచ్చారు. శనివారం మచిలీపట్నంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా