మహారాష్ట్ర అసెంబ్లీలో మజ్లిస్ ఎమ్మెల్యే సస్పెన్షన్

17 Mar, 2016 04:35 IST|Sakshi
మజ్లిస్ ఎమ్మెల్యే వారిస్ పఠాన్‌ (మహారాష్ట్ర)

‘భారత్ మాతాకీ జై’ అనేందుకు నిరాకరించిన మజ్లిస్ ఎమ్మెల్యే వారిస్ పఠాన్‌ను మహారాష్ట్ర అసెంబ్లీ బుధవారం సస్పెండ్ చేసింది. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ పార్టీలకు అతీతంగా ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది.    
 
ముంబై: ‘భారత్ మాతాకీ జై’ అనేందుకు నిరాకరించిన ఏఐఎంఐఎం ఎమ్మెల్యే వారిస్ పఠాన్‌ను మహారాష్ట్ర అసెంబ్లీ బుధవారం సస్పెండ్ చేసింది. పార్టీలకతీతంగా అతనిపై చర్యలు తీసుకోవాలంటూ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. సౌత్ ముంబైలోని బైకుల్లా స్థానం నుంచి గెలిచిన పఠాన్‌పై సస్పెన్షన్ వేటు ప్రస్తుత బడ్జెట్ సెషన్స్ అయ్యే వరకు అమల్లో ఉంటుందని పేర్కొంది. ‘‘జాతీయ నాయకులను అగౌరవ పరచడంతో పాటు ‘భారత్ మాతాకీ జై’ అనేందుకు పఠాన్ నిరాకరించారు’’ అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి గిరీష్ బపత్ చెప్పారు.

అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా ఔరంగాబాద్‌కు చెందిన ఏఐఎంఐఎం ఎమ్మెల్యే ఇంతియాజ్ జలీల్ వ్యాఖ్యలతో ఈ రగడ మొదలైంది. ‘‘ప్రజలు కట్టే పన్నుల సొమ్మును ‘గొప్ప వ్యక్తుల’ స్మారక చిహ్నాలు కట్టడానికి వెచ్చించడం ప్రభుత్వానికి తగదు’’ అని జలీల్ వ్యాఖ్యానించారు. దీనిపై ఓ శివసేన ఎమ్మెల్యే స్పందిస్తూ... ‘జలీల్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ భారత్ మాతాకీ జై అనేది లేదని ఇటీవల వ్యాఖ్యానించారు’ అని గుర్తు చేశారు. పఠాన్ కలుగజేసుకుని... ‘‘మేం ‘జైహింద్’ అంటాం కానీ ‘భారత్ మాతాకీ జై’ అనం. కచ్చితంగా ఈ నినాదం చెప్పాలని చట్టంలో ఎక్కడా లేదు’’ అన్నారు.

 

దీంతో కోపోద్రిక్తులైన అధికార బీజేపీ, శివసేనతో పాటు కాంగ్రెస్, ఎన్‌సీపీ, ఇతర పార్టీల ఎమ్మెల్యేలు పఠాన్‌ను సస్పెండ్ చేయాలంటూ పట్టుబట్టారు. దీంతో హోంమంత్రి రంజిత్ పాటిల్ పఠాన్ సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ‘వాక్‌స్వాతంత్య్రాన్ని పఠాన్ దుర్వినియోగపరిచారు. సభ సంప్రదాయాన్ని మంటగలిపారు’ అని పాటిల్ చెప్పారు. మజ్లిస్ ఎమ్మెల్యేను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆ పార్టీ చీఫ్ ఎంపీ అసదుద్దీన ఒవైసీ అన్నారు.
 
అసదుద్దీన్‌పై చర్యలు తీసుకోవాలి: ఆర్‌ఎస్‌ఎస్
జమ్మూ: ‘భారత్ మాతాకీ జై’ అనే నినాదం తాను చేయనన్న ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై చర్యలు తీసుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్ డిమాండ్ చేసింది. భారత్‌ను తమ మాతృభూమిగా భావించనివారు దేశం వదిలి వెళ్లిపోవాలని సూచించింది. ‘ఒవైసీ అసంబద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మాతృభూమికి గౌరవం ఇవ్వనివారు దేశం వదిలి తమకు నచ్చిన చోటుకి వెళ్లవచ్చు. ఇలాంటి వారు పార్లమెంట్‌కు ఎన్నికవడం దురదృష్టకరం. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం’ అని ఆర్‌ఎస్‌ఎస్ జమ్మూ కశ్మీర్ ప్రాంత్ సంగ్ చాలక్ బ్రిగ్ సుచెట్ సింగ్ అన్నారు. ‘తన మెడపై కత్తి పెట్టినా భారత్ మాతాకీ జై అని అనను’ అంటూ అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై ఆయనిలా స్పందించారు.

>
మరిన్ని వార్తలు