ఔను! చట్టాన్ని ఉల్లంఘిస్తాం!

25 Aug, 2016 15:21 IST|Sakshi
ఔను! చట్టాన్ని ఉల్లంఘిస్తాం!

థానే: సాక్షాత్తు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్‌) బేఖాతరు చేసింది. కృష్ణాష్టమి సందర్భంగా గురువారం థానెలో ఉట్టికొట్టేందుకు ఏకంగా 40 అడుగుల మానవ పిరమిడ్‌ను నిర్మించింది. అంతేకాకుండా 'నేను చట్టాన్ని ఉల్లంఘిస్తాను' అనే రాతలు ఉన్న టీషర్ట్‌లు ధరించి ఎమ్మెన్నెస్‌ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కృష్ణాష్టమి సందర్భంగా నిర్వహించే ఉట్టి వేడుకలపై సుప్రీంకోర్టు బుధవారం పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఉట్టికుండ కొట్టేందుకు 20 అడుగుల ఎత్తుకుమించి మానవ పిరమిడ్లను నిర్మించవద్దని, మైనర్లు ఈ వేడుకల్లో పాల్గొనకుండా చూడాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఉట్టి ఉత్సవాల్లో పలు ప్రమాదాలు జరిగే ప్రాణాపాయం సంభవిస్తుండటంతో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ ఆదేశాలు ఇచ్చింది.

కానీ, మహారాష్ట్రలో చాలాచోట్ల ఆదేశాలను ఉల్లంఘించారు. రాష్ట్రంలో ఘనంగా జరిగే కృష్ణాష్టమి ఉత్సవాల్లో భాగంగా పలుచోట్ల 40 నుంచి 50 అడుగుల ఎత్తులో మానవ పిరమిడ్లను నిర్మించే ఉట్టికుండలను పగులకొట్టారు. సుప్రీం ఆదేశాలను బేఖాతరు చేయడాన్ని ఎమ్మెన్నెస్‌ అధినేత రాజ్‌ ఠాక్రే సమర్థించుకున్నారు. 'మహారాష్ట్ర పండుగల పరిరక్షణ కోసం చట్టాలను ఉల్లంఘించాల్సి వస్తే అందుకు నేను సిద్ధం. ఎత్తు విషయంలో ఆంక్షలు చట్టమేమీ కాదు. కోర్టు ఆదేశాలు మాత్రమే. అందుకు మీకు ఇష్టమున్న రీతిలో మానవ అంచెలు నిర్మించుకొని గోవిందులకు (ఉట్టి వేడుకలో పాల్గొనేవారికి) చెప్పాను' అని రాజ్‌ ఠాక్రే మీడియాతో పేర్కొన్నారు.   
 

>
మరిన్ని వార్తలు