మోతెక్కనున్న సెల్ఫోన్ చార్జీలు

16 Aug, 2013 15:21 IST|Sakshi
మోతెక్కనున్న సెల్ఫోన్ చార్జీలు

చేతిలో సెల్ఫోన్ ఉంది కదాని ఎడాపెడా మాట్లాడేస్తున్నారా? కాస్త జాగ్రత్త. ఎందుకంటే... త్వరలోనే ఫోన్ చేసినా, ఎస్ఎంఎస్ ఇచ్చినా కూడా బిల్లు మోతెక్కిపోతుంది. అంతా ఇంతా కాదు. కాల్ చార్జీలు గతంలో ఉన్నదాని కంటే సగం పెరుగుతాయట. ఎందుకంటే, వచ్చే స్పెక్ట్రం వేలంలో బేస్ ధరను తగ్గించాలని టెలికం కంపెనీలు అడిగినా.. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఇక ధరలు పెంచక తప్పదని కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. స్పెక్ట్రం విలువ మరీ ఎక్కువ ఉండకూడదని, అలా ఉంటే  వినియోగదారుల నుంచి వసూలు చేసే చార్జీలను తప్పనిసరిగా పెంచాల్సి వస్తుందని.. అంతేకాక స్పెక్ట్రం ఖాళీగా ఉండిపోవడం వల్ల ఖజానాకు ఆదాయం కూడా ఏమీ ఉండదని భారతి ఎయిర్టెల్ తెలిపింది.

స్పెక్ట్రంకు 2008 సంవత్సరంలో ఆపరేటర్లు చెల్లించిన మొత్తాని కంటే 11 రెట్లు ఎక్కువ ధర పెట్టాలని టెలికం నియంత్రణ సంస్థ ప్రతిపాదించింది. భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఇండియా, లూప్ మొబైల్ సంస్థల లైసెన్సుల కాలపరిమితి 2014తో ముగుస్తుంది. అందువల్ల వాటిపైనే స్పెక్ట్రం చార్జీల పెంపు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇలా చేయాల్సి వస్తే తప్పనిసరిగా మొబైల్ కాల్ చార్జీలు, ఎస్ఎంఎస్ చార్జీలు పెంచాల్సి ఉంటుందని కంపెనీలు తెలిపాయి.

గడిచిన రెండేళ్ల కాలంలో మొబైల్ కాల్ చార్జీలు దాదాపు నూరు శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం అవి నిమిషానికి 90 పైసల నుంచి 1.20 రూపాయల వరకు ఉన్నాయి. 2012 నాటి ట్రాయ్ ప్రతిపాదనలను అమలుచేయాల్సి వస్తే వినియోగదారుల టారిఫ్ తప్పనిసరిగా 26 పైసల మేర పెంచాల్సి ఉంటుందని ఎయిర్టెల్ తెలిపింది.

ప్రభుత్వం 2010 సంవత్సరంలో 3జి స్పెక్ట్రం ధరను భారతదేశం మొత్తానికి 3,500 కోట్ల రూపాయలుగా నిర్ణయించింది. గత సంవత్సరం నిర్వహించిన వేలంలో రిజర్వుధరను 14,000 కోట్ల రూపాయలు చేసింది.

మరిన్ని వార్తలు