మొబైల్‌ ఇంటర్నెట్‌, సోషల్‌ మీడియాపై బ్యాన్‌!

18 Dec, 2016 10:49 IST|Sakshi
మొబైల్‌ ఇంటర్నెట్‌, సోషల్‌ మీడియాపై బ్యాన్‌!
  • ఇంఫాల్‌లో చర్చిలపై దాడుల నేపథ్యంలో వదంతులు
  • మత ఉద్రిక్తతలు నివారించేందుకు అధికారుల నిర్ణయం
  • ఇంఫాల్‌: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాజధాని ఇంఫాల్‌లోని మణిపూర్‌ బాప్టిస్టు కన్వేన్షన్‌ సెంటర్‌ చర్చి, తాంగ్‌ఖుల్‌ చర్చిపై అల్లరిమూకలు రాళ్లు రువ్వడంతో కలకలం రేగింది. చర్చిలపై దాడుల అంశంపై వదంతులు వస్తుండటంతో అధికారులు హై అలర్ట్‌ ప్రకటించారు. వదంతుల వ్యాప్తిని, మత ఉద్రిక్తతలను నివారించేందుకు రాష్ట్రవ్యాప్తంగా మొబైల్‌ ఇంటర్నెట్‌పై, సోషల్‌ మీడియా వెబ్‌సైట్లపై నిషేధం విధించారు.

    మణిపూర్‌లోని పలు జిల్లాలు నాగాల పూర్వీకుల భూభాగాన్ని ఆక్రమిస్తున్నాయంటూ నాగా గిరిజన గ్రూపులు ఆందోళనకు దిగడంతో మణిపూర్‌లో హింసాత్మక వాతావరణం నెలకొంది. మణిపూర్‌కు నిత్యావసరాలు సరఫరా అయ్యే ప్రధాన రహదారిని గిరిజనులు దిగ్బంధించడంతో ఆ రాష్ట్ర ప్రజలు నిత్యావసరాలతోపాటు కనీస ఔషధాలు లేక అల్లాడుతున్నారు. మరోవైపు నాగా ఉగ్రవాదుల దాడులతో రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇంఫాల్‌లో నాగా వర్గం ప్రజలు  
    తరచూ సందర్శించే చర్చిలపై కొందరు అల్లరిమూకలు రాళ్లు విసరడం కలకలం రేపింది. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

మరిన్ని వార్తలు