ఆధునిక టెక్నాలజీపై అనుమానాలు

11 Aug, 2015 02:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: పట్టిసీమ ప్రాజెక్టుకు సంబంధించిన ‘డయాఫ్రమ్ వాల్’ పరిజ్ఞానంపై చీఫ్ ఇంజనీర్ల బోర్డు సమావేశంలో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ‘పట్టిసీమలో వీరబాదుడు’ పేరిట ‘సాక్షి’లో వచ్చిన కథనంలో పేర్కొన్న అనుమానాలే సోమవారం నాటి సమావేశంలోనూ వ్యక్తమయ్యాయి. ‘వెల్ సింకింగ్’ పరిజ్ఞానంలో పనులు చేయాలనేది ప్రభుత్వం, పట్టిసీమ కాంట్రాక్టర్ ‘మెగా’ మధ్య ఉన్న ఒప్పందం కాగా, ప్రభుత్వం నుంచి తగిన అనుమతి లేకుండానే కాంట్రాక్టర్ డిజైన్‌ను మార్చి ‘డయాఫ్రమ్ వాల్’ పరిజ్ఞానాన్ని వాడుతున్న సంగతి తెలిసిందే.

దీని వల్ల అదనంగా రూ.250 కోట్ల ఖర్చవుతుందని, ఆమేరకు చెల్లింపులు చేయాలని ప్రభుత్వానికి కాంట్రాక్టర్ దరఖాస్తు చేసుకున్న విషయమూ విదితమే. అలాగే సాగునీటి శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ కాంట్రాక్టర్‌కు అనుకూలంగా అడ్డగోలు నిర్ణయం తీసుకోలేక, రాష్ట్ర స్థాయి స్టాండింగ్ కమిటీ (ఎస్‌ఎల్‌ఎస్‌సీ)తో ఇందుకు ఆమోదముద్ర వేయించేందుకు విఫలయత్నం చేసిన సంగతీ తెలిసిందే. కాంట్రాక్టర్ చెబుతున్న సాంకేతిక పరిజ్ఞానం నమ్మశక్యంగా లేదని ఎస్‌ఎల్‌ఎస్‌సీ సమావేశంలో అభిప్రాయం వ్యక్తం కావడంతో, చీఫ్ ఇంజనీర్ల బోర్డుకు విషయాన్ని నివేదించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు సోమవారం చీఫ్ ఇంజనీర్ల బోర్డు భేటీ ఏర్పాటు చేశారు. కాంట్రాక్టర్ చెబుతున్న కొత్త టెక్నాలజీ, ధరలు నమ్మశక్యంగా లేవనే అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైంది. దీంతో అదనపు సమాచారం కాంట్రాక్టర్‌ను అడగాలని నిర్ణయిం చారు. ఈనెల 17న మరోసారి భేటీ అయి నిర్ణయాన్ని వెలువరించాలని భావిస్తున్నారు. ఆ సమావేశంలో కాంట్రాక్టర్ ప్రతిపాదనకు ఆమోదముద్ర పడటం ఖాయమని, మీడియాలో వార్తలు నేపథ్యంలో వారం రోజులు వాయిదా వేశారని ఇంజనీర్లు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు