ఉగ్రవాదంపై పాక్ న్యూసెన్స్

8 Jun, 2015 03:14 IST|Sakshi
ఉగ్రవాదంపై పాక్ న్యూసెన్స్

టైజానికి ఊతమిస్తూ భారత్‌కు సమస్యలు సృష్టిస్తోంది
పాకిస్తాన్‌పై నిప్పులు చెరిగిన మోదీ
ఉగ్రవాదంపై కలసి పోరాడుదామని బంగ్లాదేశ్‌కు పిలుపు
తీస్తా నదీ జాలల పంపిణీ సమస్యకు మానవీయ పరిష్కారం

ఢాకా: బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్‌పై నిప్పులు చెరిగారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, ‘న్యూసెన్స్’ చేస్తోందని మండిపడ్డారు. సమస్యలు సృష్టిస్తూ.. భారత్‌ను ఇబ్బంది పెడ్తోందని ధ్వజమెత్తారు.

సమస్యలు సృష్టిస్తూ.. భారత్‌ను ఇబ్బంది పెడ్తోందని ధ్వజమెత్తారు. భారత్, బంగ్లాదేశ్‌లు కలసికట్టుగా ఈ ప్రాంతంలోని ఉగ్రవాదంపై పోరాడాలని పిలుపునిచ్చారు. ‘1971 బంగ్లాదేశ్ విముక్తి పోరాటం సమయంలో  90 వేల మంది పాకిస్తానీలు భారత్‌కు యుద్ధ ఖైదీలుగా చిక్కారు. మాది కూడా రాక్షస ప్రవృత్తే అయితే, వారి విషయంలో ఏం నిర్ణయం తీసుకునేవారమో!’ అని అన్నారు. ‘ఉగ్రవాదానికి సరిహద్దులు లేవు. గత 40 ఏళ్లుగా భారత్ ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటోంది. ఎంతోమంది అమాయకులు బలయ్యారు. ఉగ్రవాదానికి సహకరిస్తున్నవారు ఏం సాధించారు?ప్రపంచానికి ఏమిచ్చారు? ఉగ్రవాదానికి విలువలు, సిద్ధాంతాలు ఏమీ లేవు. దాని లక్ష్యం ఒకటే. అదే మానవత్వంతో శత్రుత్వం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని లేశమాత్రం సహించబోమన్న బంగ్లా ప్రధాని హసీనా ప్రకటనపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఢాకా వర్సిటీలోని బంగబంధు ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో బంగ్లాదేశ్‌లోని ప్రవాస భారతీయులనుద్దేశించి ఆదివారం మోదీ ప్రసంగించారు. ప్రసంగాన్ని బెంగాలీలో ప్రారంభించడంతో ప్రాంగణమంతా చప్పట్లతో మారుమోగింది. బంగ్లాదేశ్‌కు మళ్లీ వస్తానంటూ ఆయన ప్రసంగాన్ని ముగించారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు.
     
నా పర్యటనకు ఈ రోజే ముగింపు. కానీ ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది. ఆసియా దేశాలే కాదు ప్రపంచమంతా ఈ పర్యటనపై పోస్ట్‌మార్టం ప్రారంభిస్తుంది.
భూ సరిహద్దు ఒప్పందం రెండు దేశాల ప్రజల హృదయాలను కలిపే అగ్రిమెంట్..
ప్రపంచంలోని ప్రతీ ఆరుగురిలో ఒకరు భారతీయుడే. మొదటి ప్రపంచ యుద్ధంలో 75 వేలమందిని, రెండో ప్రపంచ యుద్ధంలో 90 వేల మందిని భారత్ కోల్పోయింది. ఏ దేశంపైనా ఆక్రమణకు ప్రయత్నించలేదు. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ దళాల్లో భారత్‌ది కీలక పాత్ర. అయినా.. భారత్‌కు ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేదు.
బంగ్లాదేశ్ విముక్తి పోరులో భారతీయుల పాత్ర కూడా ఉందన్న విషయం భారతీయుల గుండెల్ని ఉప్పొంగేలా చేస్తుంది.
శిశు మరణాల నిరోధంలో భారత్ బంగ్లాదేశ్ నుంచి ఎంతో నేర్చుకోవచ్చు.
మహిళా సాధికారత విషయంలో బంగ్లాదేశ్ స్ఫూర్తినిస్తుంది. ప్రధాని సహా ముఖ్య నేతలంతా మహిళలే.
మానవీయ విలువల ఆధారంగానే తీస్తా నదీజలాల సమస్యను పరిష్కరిస్తాం.
భారత్, బంగ్లాల అభివృద్ధికి సంబంధించి నాకు ఒకే రకమైన కలలున్నాయి.  
త్వరితగతిన ఎల్‌బీఏ అమలు: చరిత్రాత్మక భూ సరిహద్దు ఒప్పందాన్ని (ఎల్‌బీఏ) క్షేత్ర స్థాయిలో అత్యంత శీఘ్రంగా అమలు చేయాలని భారత్, బంగ్లాలు నిర్ణయించాయి. పౌర అణు విద్యుత్తు, పెట్రోలియం, ఇంధనం సహా పలు రంగాల్లో పరస్పర సహకారాన్ని విస్తృతం చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చాయి. ‘నవతరం.. కొత్త దిశ’ పేరుతో ఒక ప్రకటనను  మోదీ, హసీనా ఆదివారం సంయుక్తంగా విడుదల చేశారు. అందులో అంశాలు..
సరిహద్దు ఒప్పందం ఫలితంగా దేశాలు మారిన ప్రజలకు పూర్తి సహకారం
అణు విద్యుత్‌లో సాంకేతిక సహకారం. ఇంధన రంగంలో సహకారంపై కార్యదర్శుల స్థాయి చర్చలు. కోల్‌కతా, ఖుల్నాల మధ్య మరో మైత్రి ఎక్స్‌ప్రెస్
ఉగ్రవాదం, తీవ్రవాదంపై రాజీలేని పోరులో పరస్పర సహకారం. మరో దేశంలో శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసే కార్యకలాపాలకు, ఉగ్రవాద శక్తులకు తమ దేశాల్లో తావు లేదని స్పష్టీకరణ
అసాంఘిక శక్తులు సరిహద్దులు దాటకుండా ‘సరిహద్దు సమన్వయ నిర్వహణ ప్రణాళిక’ను  అమలు చేయడం..
 
ప్రజాస్వామ్య పునరుద్ధరణలో జోక్యం!
బంగ్లాలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆ దేశ విపక్ష నేత ఖలీదా జియా మోదీని కోరారు. ఆయనతో అరగంట భేటీ అయిన ఆమె బంగ్లాలో ప్రజాస్వామ్యం లేదని, ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వం గౌరవించడం లేదని అన్నారు. బంగ్లా అధ్యక్షుడు హమీద్‌తోనూ మోదీ చర్చలు జరిపారు. కాగా, మోదీ బంగ్లా పర్యటన ముగించుకుని ఆదివారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు.
 
వాజ్‌పేయి తరఫున అవార్డ్ స్వీకరణ

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రకటించిన ‘బంగ్లా విమోచన పోరాట స్మారక గౌరవ పురస్కారా’న్ని వాజ్‌పేయి తరఫున భారత ప్రధాని నరేంద్రమోదీ స్వీకరించారు. బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని మోదీకి అందించారు. బంగ్లాదేశ్ అధ్యక్ష భవనం బంగ్లాభవన్‌లో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, ఆమె మంత్రివర్గ సహచరులు, పలు దేశాల రాయబారులు హాజరయ్యారు.
 
ఢాకేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు
భారత ప్రధాని నరేంద్రమోదీ ఢాకాలో ఆదివారం ప్రఖ్యాత ఢాకేశ్వరి ఆలయాన్ని, రామకృష్ట మఠాన్ని సందర్శించారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులకు పవిత్రమైన దేవాలయాల్లో క్రీ.శ. 12వ శతాబ్దంలో బల్లాల సేనుడు నిర్మించిన ఢాకేశ్వరి ఆలయం ఒకటి. ఈ ప్రాంత ప్రధాన శక్తిపీఠాల్లో ఈ ఆలయాన్ని ఒకటిగా భావిస్తారు. ఈ దేవత పేరుమీదుగానే ఈ నగరానికి ఢాకా అని పేరు వచ్చిందని ప్రతీతి. ఆలయంలో దాదాపు పావుగంట పాటు గడిపిన మోదీ.. ఢాకేశ్వరి మాతకు ప్రత్యేక పూజలు జరిపారు. రామకృష్ణ మఠ్‌లో అక్కడి స్వాములతో కలిసి మోదీ ప్రార్ధనలు చేశారు. రామకృష్ణ మిషన్‌తో మోదీకి ప్రత్యేక అనుబంధం ఉంది.

మరిన్ని వార్తలు