ఎంత మోదీ అయినా గాంధీ కాగలరా?

17 Jan, 2017 16:45 IST|Sakshi
ఎంత మోదీ అయినా గాంధీ కాగలరా?

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ను పరిగణలోకి తీసుకోకుండానే ఏకపక్షంగా పెద్ద నోట్లను రద్దు చేసి వివాదాస్పదుడైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇప్పుడు ‘ఖాదీ గ్రామ పరిశ్రమల కమిషన్‌’ క్యాలెండర్‌పైనా, డైరీపైనా నూలు వడుకుతున్న గాంధీ చిత్రం స్థానంలో తాను స్వయంగా దర్శనమిచ్చి మరింత వివాదాస్పదులయ్యారు. ఈ అంశంపై సోషల్‌ మీడియా తీవ్రంగా మండిపడుతోంది. గాంధీ చారిత్రాత్మక సంఘటనల్లో మోదీ ఉన్నట్లుగా ఫొటోలను మార్ఫింగ్‌ చేసి తనదైన శైలిలో వ్యంగ్యోక్తులు విసురుతోంది.

ఖాదీ గుడ్డల ప్రోత్సాహం కోసం, దేశ స్వాతంత్య్రం కోసం మహాత్మా గాంధీ నాడు సూట బూటును వదిలేసి అత్యంత నిరాడంబరుడిగా ‘కొల్లాయి’ గట్టుకొని తిరిగితే, మొన్న బనీను, భుజంపై చిన్న కండువా వేసుకుని తిరిగే నరేంద్ర మోదీ నేడు సూటుబూటు ధరించి ఖరీదైన దొరబాబులా తిరుగుతున్నారు. పైగే అదే దుస్తులపై గాంధీ నూలు వడుకుతున్నట్లుగా ఫోజిచ్చారు. నాడు గాంధీ నిజంగా నూలు వడకడం నేర్చుకోవడమే కాకుండా వీలైనప్పుడల్లా దాన్ని వత్తిగానే కొనసాగించారు. మోదీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన వీడియోను చూసినట్లయితే మోదీకి ఏ మాత్రం నూలు వడకడం రాదని ఇట్టే తెలిసిపోతుంది. మొదటి నుంచి భారతీయ ఖాదీ పరిశ్రమకు గాంధీ బ్రాండ్‌ చిహ్నమే.

నేడు దేశంలో ఖాదీని ప్రోత్సాహించాలనుకోవడం, అందుకు మోదీని బ్రాండ్‌ అంబాసిడర్‌గా వాడుకోవాలని చూడడాన్ని ఎవరూ తప్పు పట్టడం లేదు. గాంధీ చిత్రాన్ని తొలగించి ఆ స్థానంలో తాను కూర్చోవడాన్నే తప్పు పడుతున్నారు. ఇతర విధాల మోదీని బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రచారం చేసి ఉన్నట్లయితే బాగుండేదన్నదే మెజారిటీ ప్రజల అభిప్రాయం. యూపీఏ నుంచి పథకాలను కాఫీ కొట్టిన మోదీ, నిన్న జవహర్‌ లాల్‌ నెహ్రూ షర్టును, నేడు ఖాదీ చరఖాను కాపీ కొట్టారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గాంధీ ముఖచిత్రం ఉన్నందునే భారత కరెన్సీ విలువ పడిపోయిందని, మోదీ వల్లనే కరెన్సీ విలువ పెరిగిందని, ఇప్పుడు ఖాదీకి మోదీ ఫొటో వల్లనే డిమాండ్‌ పెరుగుతుందంటూ హర్యానా బీజేపీ మంత్రి అనిల్‌ విజ్‌ చేసిన వ్యాఖ్యలు మరో ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. కరెన్సీ పైకూడా గాంధీ స్థానంలో మోదీ చిత్రాలు వస్తాయేమో!

చరిత్రలో మిగిలిపోవాలనుకోవడంలో, చరిత్రను సష్టించాలనుకోవడంలో తప్పులేదు. చరిత్రను చెరిపేయాలనుకోవడంలో, తానే చరిత్ర కావాలనుకోవడంలో తప్పుంది. సోవియెట్‌ మాజీ నేత జోసఫ్‌ స్టాలిన్‌ కూడా మార్క్సిస్టు మేథావైన ట్రాట్‌స్కీ లాంటి వారి ఫోటోలను రష్యా చరిత్ర నుంచి తొలగించారు తప్ప, ఆ స్థానంలో తన ఫొటోలను చేర్చుకోలేదు. హాలివుడ్‌ చిత్రం ‘ఫారెస్ట్‌ గంప్‌’లో హీరోగా నటించిన టామ్‌ హాంక్స్‌ 20వ శతాబ్దం నాటి అమెరికా చరిత్రలోకి వెళ్లారుతప్ప తాను చరిత్ర కాలేదు. గాంధీ స్థానంలో మోదీ కూర్చోవడం తాను చరిత్ర కావాలనుకోవడంలా ఉంది. అందుకేనేమో సోషల్‌ మీడియా భారత చారిత్రక ఘట్టాలకు సంబంధించిన పలు సన్నివేశ చిత్రల్లో మోదీ మొఖాన్ని మార్ఫింగ్‌చేసి పెడుతున్నారు.

- ఓ సెక్యులరిస్ట్‌ కామెంట్‌

>
మరిన్ని వార్తలు