ఎంత నల్లధనం గుట్టురట్టు కానుందో తెలుసా?

10 Nov, 2016 19:28 IST|Sakshi
ఎంత నల్లధనం గుట్టురట్టు కానుందో తెలుసా?
అవినీతి, పన్ను ఎగవేతపై ఉక్కుపాదం మోపడానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయం వల్ల దేశ ఖజానాకు అక్షరాల రూ. మూడు లక్షల కోట్ల (45 బిలియన్‌ డాలర్ల) లాభం చేకూరనుందని విదేశీ మీడియా విశ్లేషించింది. దేశ బడ్జెట్‌కు చేరనున్న ఈ అదనపు మొత్తం ఏకంగా ఐస్‌లాండ్‌ దేశ ఆర్థిక వ్యవస్థతో సమానమని పేర్కొంది.
 
రూ. 500, వెయ్యినోట్ల రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న ఆకస్మిక నిర్ణయం వల్ల ఏకంగా రూ. మూడు లక్షల కోట్ల (45బిలియన్‌ డాలర్ల) నల్లధనం వెలికిరానుందని, పన్నును తప్పించుకునేందుకు ఈ మొత్తాన్ని కరెన్సీని విదేశాల్లో దాచిపెట్టారని ముంబైకి చెందిన బ్రోకరేజి సంస్థ ఎడెల్‌వీస్‌ సెక్యూరిటీ లిమిటెడ్‌ విశ్లేషించింది. ఇక ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ ప్రైమరీ డీలర్‌షిప్‌ లిమిటెడ్‌ మరింత ఆశాజనకమైన అంచనా వేసింది. ఏకంగా 4.6 లక్షల కోట్ల నల్లధనం బయటకు రావొచ్చునని అంచనా వేసింది. 
 
ఆర్థికవేత్తలు పెద్దనోట్ల రద్దు నిర్ణయం ప్రభావాలు ఏమిటన్న దానిపై లోతుగా విశ్లేషణలు జరుపుతున్నారు. ప్రస్తుతం దేశంలో 17.8  లక్షల కోట్ల నగదు కరెన్సీరూపంలో చలామణిలో ఉంది. పెద్దనోట్ల రద్దుతో ఏకంగా ఇందులో 86శాతం నగదు తుడిచిపెట్టుకుపోనుంది. ఇలా తుడిచిపెట్టుకుపోతున్న కరెన్సీలో మూడోవంతు నల్లధనం లేదా, ప్రకటించని నగదు ఉండే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. ఈ నల్లధనం వెలుగులోకి వస్తే.. ఆసియాలో అత్యంత ఎక్కువ ద్రవ్యలోటు కలిగిన భారత్‌.. ఆ లోటును భర్తీచేసుకొని మెరుగైన ఆర్థిక వ్యవస్థగా ఎదిగే అవకాశముందని భావిస్తున్నారు. వెలుగులోకి వచ్చిన ఈ నల్లధనాన్ని దేశంలో పలు ఆర్థిక సంస్కరణలకు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగించవచ్చునని, అంతేకాకుండా ఆర్బీఐ తన అప్పులను తీర్చుకొని.. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు డబ్బులు కూడా సమకూర్చవచ్చునని ఎడెల్‌వీస్‌ విశ్లేషకుడు మనోజ్‌ బహెతీ తెలిపారు. 
>
మరిన్ని వార్తలు