ట్రంప్‌.. ఆ అవకాశం ఇవ్వు..: మోదీ

27 Jun, 2017 08:39 IST|Sakshi



వాషింగ్టన్‌:
భారత్‌కు రావాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఆయన కుటుంబసభ్యులను ప్రధాని నరేంద్రమోదీ ఆహ్వానించారు. 'మీ కుటుంబసభ్యులతోపాటు మీరు భారత్‌ రావాల్సిందిగా నేను సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మీకు భారత్‌లో ఆహ్వానం పలికి అతిథ్యమిచ్చే అవకాశాన్ని నాకు ఇవ్వండి' అని మోదీ కోరారు. వైట్‌హౌస్‌లోని రోజ్‌గార్డెన్స్‌లో ట్రంప్‌తో కలిసి సంయుక్త మీడియా ప్రకటన చేసే సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తమ మధ్య తొలిసారి జరిగిన దౌత్య సమావేశంలో మోదీ-ట్రంప్‌ విస్తారంగా చర్చించుకున్నారు. అత్యంత స్నేహపూర్వక వాతావరణంలో ఇద్దరు మంతనాలు జరిపారు. ఏకాంతంగా 20 నిమిషాలపాటు మాట్లాడుకున్నారు. మోదీకి పదే పదే ధన్యవాదాలు తెలిపిన ట్రంప్‌.. తమ సంభాషణ ఎంతో ఫలప్రదంగా సాగిందంటూ హర్షం వ్యక్తం చేశారు. భారత్‌-అమెరికా మధ్య స్నేహం, పరస్పర గౌరవం గతంలో ఎన్నడూలేనిరీతిలో గొప్పగా కొనసాగనుందని ట్రంప్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ ట్రంప్‌ కూతురు ఇవాంకను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ ఏడాది ఉత్తరార్ధంలో భారత్‌లో జరిగే గ్లోబల్‌ ఎంటర్‌ప్రీనుర్‌షిప్‌ సదస్సుకు వచ్చే అమెరికా పారిశ్రామికవేత్తలకు ఇవాంక నేతృత్వం వహించాలని మోదీ కోరారు. తన ఆహ్వానాన్ని ఆమె అంగీకరించిందని భావిస్తున్నట్టు చెప్పారు.


భారత్‌కు రాబోతున్న ట్రంప్‌!
ఇక మోదీ ఆహ్వానాన్ని అంగీకరించిన ఇవాంక ట్రంప్‌ ఆయనకు ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపింది. మరోవైపు భారత్‌కు రావాలన్న ప్రధాని మోదీ ఆహ్వానాన్ని డొనాల్డ్‌ ట్రంప్‌ సైతం అంగీకరించారు. ఆయన త్వరలో భారత్‌కు రానున్నట్టు వైట్‌హౌస్‌ ధ్రువీకరించింది. అయితే, ట్రంప్‌ భారత పర్యటనకు సంబంధించిన వివరాలేవీ ఇంకా వెల్లడించలేదు.

మరిన్ని వార్తలు