మోదీ అంటే ఏంటి?

6 Aug, 2016 13:28 IST|Sakshi
మోదీ అంటే ఏంటి?

న్యూఢిల్లీ: What is Narendra Modi?(నరేంద్ర మోదీ అంటే ఏమిటి?) అని ఎవరిని అడిగినా.. నరేంద్ర మోదీ భారత ప్రధానమంత్రివర్యుని నామధేయమని, పూర్తి పేరు నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అని,  ఊరు గుజరాత్ మెహసానా జిల్లాలోని వాద్ నగర్ అని.. మోద్ ఘన్చి తేలి(చమురు అద్దకం) వృత్తిదారులు కావడంతో 'మోదీ' వారి ఇంటిపేరుగా స్థిరపడిందని.. దామోదర్దాస్ ముల్చంద్, హీరాబెన్ మోదీల ఆరుగురు పిల్లల్లో మూడో సంతానమైన నరేంద్ర మోదీ చిన్నప్పటి నుంచి కష్టపడి పనిచేసేవారని... ఇలా ఆయన జీవిత చరిత్ర మొత్తం చెప్పగలరు. కానీ వీటన్నింటికంటే మిన్నగా మోదీని విశ్లేషించగల సామర్థ్యం కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఒక్కరికే సొంతం. ఎలాగంటారా?..

ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ పథకం గురించి మనందరికి తెలిసిందే. దేశంలోని 500 నగరాల్లో ఆ పథకం తీసుకొచ్చిన మార్పులు, భవిష్యత్ కార్యాచరణ తదితర వివరాలను పొందుపరుస్తూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సర్వే నిర్వహించింది. 'స్వచ్ఛ సర్వేక్షణ్' పేరుతో నిర్వహించిన ఆ సర్వే ప్రతులను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు శనివారం ఢిల్లీలో విడుదలచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

'స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిననాడే మోదీ గారు చెప్పారు.. ఇది కచ్చితంగా ప్రజాఉద్యమంగా మారుతుందని. అవును. ఆయన ఊహించినట్లే ఇవ్వాళ స్వచ్ఛ భారత్ లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యారు. అదేదో ప్రభుత్వ కార్యక్రమంలా భావించకుండా ప్రజలంతా స్వచ్ఛ భారత్ ను తమదిగా స్వీకరించించారు. అందుకే నేనంటాను.. మోదీ అంటే మేకింగ్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా (MODI means Making Of Developed India) అని! వాజపేయి హయాంలో భారత్ వెలిగిపోతోంది (షైనింగ్ ఇండియా) నినాదం తరహాలో వెలుగులోకి వచ్చిన మోదీ (మేకింగ్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా) నినాదం వచ్చే ఎన్నికల్లో ఏమేరకు ప్రభావం చూపుతుందోమరి!

మరిన్ని వార్తలు