చైనా వేదికగా పాకిస్థాన్‌పై..

5 Sep, 2016 18:19 IST|Sakshi
చైనా వేదికగా పాకిస్థాన్‌పై..

చైనా వేదికగా దాయాది పాకిస్థాన్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రంగా మండిపడ్డారు. దక్షిణాసియాలో 'ఒకే దేశం' ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్నదని దుయ్యబట్టారు. పాకిస్థాన్‌ పేరును మోదీ నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ ఆయన దాయాది దేశాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారన్నది సుస్పష్టం.

హాంగ్‌ఝౌ నగరంలో జరుగుతున్న జీ20 సదస్సు ముగింపు సమావేశంలో ప్రపంచ అగ్రరాజ్యధినేతలను ఉద్దేశించి  ప్రధాని మోదీ ప్రసంగించారు. 'దక్షిణాసియాలో ఒకే దేశం తన ఉగ్రవాద ఏజెంట్లను వివిధ దేశాల్లోకి పంపుతోంది' అని పేర్కొన్నారు. కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని తమ జాతీయ పాలసీకి సాధనంగా వాడుకుంటున్నాయని మండిపడ్డారు. ప్రపంచ దేశాలు ఉమ్మడిగా పనిచేస్తూ, గళమెత్తుతూ ఉగ్రవాదంపై సత్వరమే పోరాడాల్సిందిగా భారత్‌ కోరుతున్నదని మోదీ అన్నారు. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న దేశాలను ఏకాకులను చేసి, వాటిపై ఆంక్షలు విధించాలని, అంతేకానీ వాటికి రివార్డులు ఇవ్వొద్దని మోదీ స్పష్టం చేశారు.

ఉగ్రవాదాన్ని ఏమాత్రం ఉపేక్షించకపోవడమే భారత్‌ విధానమని, మాకు ఉగ్రవాదంటే ఉగ్రవాదేనని అన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు, పాకిస్థాన్‌ను ఏకాకి చేసేందుకు అంతర్జాతీయ సమ్మతిని పొందాల్సిన అవసరముందని మోదీ ఇప్పటికే చైనా అధ్యక్షుడు జీ జింగ్‌పింగ్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్‌ టర్న్‌బల్‌తో జరిపిన భేటీల్లో కోరిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు