‘అద్వానీపై ప్రధాని మోదీ కుట్ర’

19 Apr, 2017 13:23 IST|Sakshi
‘అద్వానీపై ప్రధాని మోదీ కుట్ర’
న్యూఢిల్లీ: రాష్ట్రపతి పదవికి పోటీ పడకుండా బీజేపీ కురువృద్ధుడు ఎల్‌ కే అద్వానీపై ప్రధాని నరేంద్ర మోదీ కుట్ర చేశారని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోపించారు. ఇందులో భాగంగానే బాబ్రీ మసీదు కేసును తిరగదోడారని అన్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమా భారతికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో లాలూ ప్రసాద్ స్పందించారు.

‘సీబీఐ.. ప్రధాని చెప్పుచేతుల్లో ఉంటుంది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఈ రోజు సుప్రీంకోర్టులో అద్వానీకి వ్యతిరేకంగా సీబీఐ వ్యవహరించింది. ఈసారి అద్వానీ రాష్ట్రపతి అవుతారని ప్రచారం జరుగుతోంది. అద్వానీ అవకాశాలకు ప్రధాని మోదీ గండికొట్టారు. రాష్ట్రపతి పదవికి పోటీలో లేకుండా చేసేందుకే మోదీ ప్రభుత్వం రాజకీయ కుట్ర చేసిందని ఎవరైనా అర్థం చేసుకోగలర’ని లాలూ ప్రసాద్‌ వ్యాఖ్యానించారు.

2002 గుజరాత్‌ అలర్ల సమయంలో తనను అద్వానీ కాపాడారన్న విశ్వాసం కూడా మోదీకి లేదని ఆక్షేపించారు. ‘గుజరాత్‌ లో అల్లర్లు జరినప్పుడు మోదీని అద్వానీ కాపాడారు. ముఖ్యమంత్రి పదవి నుంచి మోదీని తొలగించాలని అప్పటి ప్రధాని వాజపేయి కోరినా అద్వానీ అడ్డుపడ్డార’ని లాలూ చెప్పారు. 
మరిన్ని వార్తలు