ఉగ్రభూతంపై ఉమ్మడి పోరు

17 Aug, 2015 07:36 IST|Sakshi
ఉగ్రభూతంపై ఉమ్మడి పోరు

అబుదాబి: పశ్చిమాసియా దేశాల ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలలో బయటి దేశాల ప్రమేయం వల్లనే అశాంతి పెరిగిందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆ దేశాలు కలసికట్టుగా కృషి చేస్తే సమస్యల పరిష్కారం తేలికవుతుందని పేర్కొన్నారు.  రెండు రోజుల పర్యటన నిమిత్తం యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) వచ్చిన సందర్భంగా మోదీ, స్థానిక ఖలీజ్ టైమ్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ద్వైపాక్షిక సమస్యలు ఆయా దేశాలు పూనుకుంటేనే పరిష్కారమవుతాయన్నది తన ప్రగాఢ విశ్వాసమన్నారు.

పశ్చిమాసియా దేశాలన్నింటితో భారత్‌కు సత్సంబంధాలు ఉండటం విశేషమని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలోని అంతర్గత సమస్యల్లో జోక్యం చేసుకోకూడదన్న మౌలిక నియమాన్ని భారత్ పాటిస్తూ, వివిధ అంశాల్లో చర్చలకు మద్దతిస్తోందన్నారు. ఈ ప్రాంత దేశాలు సమష్టిగా, నిర్మాణాత్మకంగా శాంతి స్థాపనకు కృషి చేయాలని, ఈ కృషి కేవలం ఈ ప్రాంతానికే కాకుండా మొత్తం ప్రపంచానికే మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు.

ఇరాన్‌తో అగ్రదేశాల  అణు ఒప్పందం గురించి ప్రస్తావిస్తూ ‘ఉగ్రవాదం వంటి అతి తీవ్రమైన సమస్యలు ఈ ప్రాంతంలో స్థిరత్వాన్ని, శాంతి, సామరస్యాలకు విఘాతం కలిగిస్తున్నప్పుడు అణు ఒప్పందం అనేది ఈ ప్రాంతంలో అస్థిరత్వానికి కారణం కానే కాకూడదు’ అని అన్నారు. పరస్పర విశ్వాసంతో ఈ ప్రాంతంలో చర్చలు, సహకారం మొదలవాలని అన్నారు. 34 ఏళ్ల తరువాత తొలిసారి భారత ప్రధాని యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌లో పర్యటిస్తున్నారు. ఆదివారం  ఢిల్లీ నుంచి వెళ్లిన మోదీ సాయంత్రం అబుదాబి చేరుకున్నారు.

విమానాశ్రయంలో  యువరాజు షేక్ మహమ్మద్ జాయేద్ అల్ నహ్యా ప్రొటోకాల్‌ను పక్కన పెట్టి మోదీకి సంప్రదాయక స్వాగతం పలికారు. యువరాజుతో పాటు ఆయన ఐదుగురు సోదరులూ మోదీ స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. యూఏఈ సైనిక దళాల వందనాన్ని  మోదీ స్వీకరించారు.  ప్యాలెస్‌లో తనకు ఏర్పాటు చేసిన బసకు మోదీ చేరుకున్నారు. అక్కడ యువరాజుతో కాసేపు చర్చలు జరిపారు.
 
శాంతికి ప్రతీక ఈ మసీదు.. అక్కడి నుంచి ముందుగా అరబ్‌లకు అత్యంత పవిత్రమైన షేక్ జాయేద్ గ్రాండ్ మసీదును సందర్శించారు. 82 గుమ్మటాలతో అద్భుతమైన  ఇస్లామిక్ నిర్మాణ కౌశల్యానికి ప్రసిద్ధి చెందిన ఈ మసీదు.. మక్కా, మదీనా మసీదుల తర్వాత మూడో అతిపెద్దది. లక్షా 80 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 3,500 కోట్లతో నిర్మించిన ఈ మసీదుకు యూఏఈ తొలి అధ్యక్షుడు షేక్ జాయేద్ బిన్ సుల్తాన్ అన్ నహ్యా పేరును పెట్టారు.

‘ఈ అపూర్వమైన పవిత్ర మసీదును సందర్శించటం నాకు చాలా సంతోషంగా ఉంది.  ఇది అద్భుతమైన నైపుణ్యానికి, సృజనాత్మకతకు గొప్ప ఉదాహరణ. శాంతికి, కరుణకు, సౌభ్రాతృత్వానికి, ఇస్లాంపై అచంచలమైన విశ్వాసానికి ఇది ప్రతీక’ అని మోదీ సందర్శకుల పుస్తకంలో రాశారు.  
 
కీలక భాగస్వామిగా యూఏఈ
యూఏఈతో తన చర్చల ఎజెండాను ఖలీజ్‌టైమ్స్‌కు ఇంటర్వ్యూలోనే మోదీ స్పష్టంగా సూచించారు. వాణిజ్యం, ఉగ్రవాద నిరోధం వంటి అంశాలలో యూఏఈతో కీలక భాగస్వామ్యం నెరపడానికి భారత్ కట్టుబడి ఉందన్నారు. రెండు దేశాలు ఉగ్రవాదం, తీవ్రవాదంతో సహా కొన్ని అంశాలలో ఒకే విధమైన ఆందోళనలను ఎదుర్కొంటున్నాయి కాబట్టి ఈ అంశాలు రెండు దేశాలకు అత్యధిక ప్రాధాన్యాంశాలన్నారు.  

భద్రత విషయంలో యూఏఈతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని, ఇంధనం, పెట్టుబడుల రంగాలలో సహకారాన్ని ఆశిస్తున్నామన్నారు. వ్యాపారానికి భారత్ ఆకర్షణీయ గమ్యంగా పెట్టుబడిదారులను ప్రోత్సహించటం తన లక్ష్యమన్నారు. 1970లలో 180 మిలియన్ అమెరికన్ డాలర్లుగా ఉన్న యూఏఈ-భారత్ వ్యాపార బంధం ప్రస్తుతం 60 బిలియన్ డాలర్లతో భారత్ మూడో అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా ఉందని.. ఇది మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నట్లు వివరించారు.  
 
భారతీయ కార్మికులతో భేటీ

ఆ తర్వాత భారత్ నుంచి వలస వచ్చిన కార్మికులను ఐ-కాడ్ కార్మికుల రెసిడెన్షియల్ క్యాంప్ హౌస్‌లో కలిసి వారి సమస్యలపై చర్చించారు.  క్రీడా హాల్‌లో వారితో ఫొటోలు దిగారు. ఈ దేశ అభివృద్ధిలో 26 లక్షల మంది భారతీయులు భాగస్వామ్యం వహించటం ఆనందంగా ఉందని  మోదీ అన్నారు. భారత ప్రభుత్వం వారికి అన్ని విధాలా సహకారాన్ని అందిస్తుందని  హామీ ఇచ్చారు.

సోమవారం ఉదయం యువరాజుతో చర్చలు జరిపిన అనంతరం మోదీ దుబాయ్‌కి వెళ్తారు. అక్కడ ఉపాధ్యక్షుడు, ప్రధాని అయిన షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోమ్‌తో చర్చలు జరుపుతారు. ఆ తరువాత ప్రపంచంలో అత్యంత ఎత్తై బుర్జ్ ఖలీఫాను సందర్శిస్తారు. అనంతరం దుబాయ్ క్రికెట్ మైదానంలో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి బహిరంగ సభలో మాట్లాడతారు.  మోదీ పర్యటనను పురస్కరించుకుని యూఏఈలో ఒక దేవాలయం నిర్మించుకోవటానికి స్థలం కేటాయించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.
 
మోదీ సెల్ఫీ దౌత్యం అరబ్ దేశంలో కూడా కొనసాగింది. ప్రఖ్యాత షేక్ జాయేద్ మసీదును సందర్శించిన సందర్భంగా మోదీ అరబ్ రాజకుటుంబీకులు, షేక్‌లతో సెల్ఫీ దౌత్యం నెరిపారు. మీగడ రంగు కుర్తా, కాషాయం తెలుపు లాల్చీ ధరించిన మోదీ మసీదుకు వచ్చిన షేక్‌లతో  తన మొబైల్‌తో సెల్ఫీకి పోజ్‌లిచ్చారు.

మరిన్ని వార్తలు