ముద్దు సీన్లకు 'సెన్సార్' ఓకే!

1 Aug, 2016 13:46 IST|Sakshi
ముద్దు సీన్లకు 'సెన్సార్' ఓకే!

న్యూఢిల్లీ: ముద్దు సీన్ల విషయంలో ఫిలిం మేకర్స్కు , సెన్సార్ బోర్డుకు మధ్య చెలరేగుతున్న వివాదాలకు తెరపడినట్లేనా? హైకోర్టు అక్షింతలతో బోర్డు తన తీరు మార్చుకుందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. హృతిక్ రోషన్, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటించిన 'మొహెంజొదారో' లో రొమాంటిక్ ట్రాక్ తోపాటు మూడు లిప్ లాక్ సీన్లు ఉన్నప్పటికీ.. సెన్సార్ బోర్డు ఆ సినిమాకు ఒక్కటంటే ఒక్క కట్ కూడా చెప్పకపోవడం విశేషం. సింగిల్ కట్ లేకుండా 'మొహెంజొదారో'కు  యూ/ఏ సర్టిఫికేట్ జారీ అయనట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. (అతనితో ముద్దుకి సిగ్గుపడలేదు!)

ఎపిక్ అడ్వెంచర్ డ్రామాగా అశుతోష్ గొవారికర్ తెరకెక్కించిన 'మొహెంజొదారో' ఆగస్టు 12న విడుదల కానుంది. భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. తమ సినిమా సెన్సార్ చిక్కులను సులువుగా దాటిరావడంతో దర్శకనిర్మాతలు ఊపిరిపీల్చుకున్నారు. సినిమాల్లో ముద్దు సీన్లపై దర్శకనిర్మాతలు, సెన్సార్ బోర్డుకు మధ్య వివాదాలు ఇటీవల తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. జేమ్స్ బాండ్ సినిమా 'స్పెక్ట్రే' మొదలు దీపికా- రణ్ బీర్ ల 'తమాషా', కాజల్ అగర్వాల్- రణదీప్ హుడాల 'దో లబ్జోంకీ కహానీ' తదితర సినిమాల్లో ముద్దు సీన్లకు సెన్సార్ బోర్డు కత్తెర వేసింది. కాగా, ఇటీవల 'ఉడ్తా పంజాబ్' సినిమా విడుదల సమయంలో సెన్సార్ బోర్డు తీరుపై బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 'సీన్లు కత్తిరించడంకాదు.. సర్టిఫికెట్ జారీ వరకే మీ బాధ్యత. సినిమా చూడాలా వద్దా అనేది ప్రేక్షకుడి ఇష్టం' అని హైకోర్టు బోర్డును మందలించింది.