కోటలు పిలుస్తున్నాయి!

20 Feb, 2017 02:34 IST|Sakshi
మెదక్‌ కోట

- రూ.100 కోట్లతో ముస్తాబుకు రంగం సిద్ధం
- జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులు లక్ష్యంగా భారీ ప్రాజెక్టు

సాక్షి, హైదరాబాద్‌:
ఐదొందల అడుగుల ఎత్తు న్న గుట్ట.. మెట్ల దారిలో ముందుకు సాగితే 20 అడుగుల ఎత్తుతో సింహద్వారం, ఇరువైపులా జూలు విదిల్చి గంభీరంగా ఉన్న సింహాల విగ్రహాలు.. దాటి ముందుకెళితే గజద్వారం.. ఘీంకరిస్తున్న ఏనుగుల ఆకృతిలోని ప్రతి మలు.. ఏడు దర్వాజాలు.. 16 అడుగుల పొడ వున్న భారీ ఫిరంగి.. ఇదంతా మెదక్‌ కోట రాజఠీవి. సాధారణంగా కోట అనగానే మనకు హైదరాబాద్‌లోని గోల్కొండ కోట గుర్తుకు వస్తుంది. కానీ.. రాష్ట్రంలో మరో 30 వరకు కోటలున్న సంగతి తక్కువ మందికే తెలుసు.

భువనగిరి కోట
ఇప్పుడవన్నీ పర్యాటక కళను సంతరించుకో నున్నాయి. రాష్ట్రంలో పర్యాటకానికి కొత్త రూపుదిద్దే చర్యల్లో భాగంగా రూ.100 కోట్లతో భారీ ప్రాజెక్టు సిద్ధమవుతోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిధుల కోసం కేంద్రానికి ప్రతిపాదన పంపగా.. కేంద్రం సూత్ర ప్రాయం గా అంగీకరించినట్లు సమాచారం. కేంద్రం గతేడాది సోమశిల బ్యాక్‌ వాటర్‌ ఆధారంగా కొల్లాపూర్‌లో ప్రకృతి అందాలను అభివృద్ధి చేసేందుకు రూ.98 కోట్లు.. ట్రైబల్‌ సర్క్యూట్‌ కింద గోదావరి తీరంలో ఆదిలా బాద్‌ నుంచి ఖమ్మం వరకు ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి మరో రూ.98 కోట్లు కేటాయించింది.

రోప్‌ వేలు.. లైట్‌ షోలు.. సాహసక్రీడలు
భువనగిరి ఖిలా, ఎలగందుల కోట, మెదక్‌ దుర్గం, జఫర్‌గడ్, దేవరకొండ కోట, రాచకొండ ఖిలా ఇలా తరచి చూస్తే జిల్లాకు ఒకటి రెండు కోటలు కనిపిస్తాయి. ఒక్కో కోటది ఒక్కో చరిత్ర.. విభిన్న నిర్మాణ కౌశలం.. కొన్ని ఆలనా పాలనా లేక ముళ్లపొదలతో నిండిపోయి, కూలిపోయి కాలగతిలో కలిసిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. కొన్ని మాత్రం మెరుగ్గా ఉన్నాయి. ప్రస్తుతం అలాంటి కోటలను గుర్తించి అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకట్టుకునేందుకు రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చర్యలు చేపట్టింది.

                                                                                                               దేవర కొండ కోట
కొన్ని ప్రధాన కోటలను ఓ సర్క్యూట్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. కోటల వద్ద దిగువ నుంచి పై వరకు, అక్కడి నుంచి సమీపంలో ప్రకృతి శోభ ఉండే ప్రాంతం వరకు రోప్‌ వే ఏర్పాటు చేస్తారు. ప్రధాన రహదారుల నుంచి కోట వరకు చేరుకోవటానికి రెండు వరసల రోడ్లు నిర్మిస్తారు. కోట వద్ద రెస్టారెంట్లు, కాటేజీలు, దుకాణాలు, ఇతర మౌలిక వసతులు ఏర్పాటు చేస్తారు. భువనగిరి కోట లాంటి ఎత్తయిన ప్రాంతాల్లో సాహస క్రీడలకు వీలుగా వసతులు కల్పిస్తారు. క్లైంబింగ్, ట్రెక్కింగ్, మినీ బంగీ జంపింగ్, స్విమ్మింగ్‌ పూల్స్, కోట చరిత్రను తెలిపే ఏర్పాట్లు, సౌండ్‌ అండ్‌ లైట్‌షోలు ఏర్పాటు చేస్తారు.

ఈ ప్రాజెక్టుతో పర్యాటకానికి ఊతం
‘‘రాష్ట్రంలో అద్భుత కోటలున్నాయి. గోల్కొండ తప్ప మిగతా వాటికి ప్రాచుర్యం లేదు. వాటిని అభివృద్ధి చేసి, వసతులు కల్పిస్తే ఆయా ప్రాంతాలు పర్యాటకులను ఆకర్షించడం ఖాయం. ఈ సంవత్సరం కోటల అభివృద్ధితో కేంద్రానికి ప్రతిపాదనలు పంపనున్నాం. దాదాపు రూ.100 కోట్లు వస్తాయని ఆశిస్తున్నాం. ఇది విదేశీ పర్యాటకులను బాగా ఆకట్టుకునే ప్రాజెక్టు అవుతుంది..’’
– పేర్వారం రాములు, రాష్ట్ర పర్యాటక సంస్థ చైర్మన్‌

ఎలగందుల కోట

 

మరిన్ని వార్తలు