అమ్మాయిలే ఎందుకు చనిపోతున్నారు!

21 Oct, 2015 16:34 IST|Sakshi
అమ్మాయిలే ఎందుకు చనిపోతున్నారు!

న్యూయార్క్: భావి భారతదేశంలో పెద్ద సమస్య తలెత్తే అవకాశం ఉంది. అది.. అమ్మాయిల సంఖ్య నానాటికీ తగ్గిపోవడం. ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన ఓ నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. 'ది వరల్డ్ ఉమెన్ 2015' పేరిట ఐక్యరాజ్య సమితి ఓ నివేదికను విడుదల చేసింది. ఇందులో తూర్పు ఆసియా, దక్షిణాసియా, పశ్చిమాసియాలో అబ్బాయిలు, అమ్మాయిల మధ్య నిష్పత్తిని వెల్లడించింది. ఈ మూడు ప్రాంతాల్లో తూర్పు ఆసియాలో 50.5 మిలియన్ ల మంది పురుషులు ఉన్నారు.

ఇక్కడ అత్యధిక సంఖ్యలో పురుషులు ఉండటానికి చైనా కారణం. ఇక దక్షిణాసియాలో 49.5 మిలియన్ల మంది పురుషులు ఉండగా అంత ఎక్కువ సంఖ్యలో ఉండటానికి ఇండియానే కారణమట. ఇక పశ్చిమాసియా 12.1 మిలియన్ల మంది పురుషులు ఉండగా వారిలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలే కారణం అని నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా చూసినప్పటికీ చైనా, ఇండియాలోనే అత్యధికంగా పురుషులు స్తీల నిష్పత్తి మధ్య తీవ్ర వ్యత్యాసం ఉందని, ఇక భారత్లో పురుషులు అధిక సంఖ్యలో ఉండి స్త్రీలు తక్కువ సంఖ్యలో ఉండటానికి ప్రధాన కారణం ఐదేళ్లలోపు బాల బాలికల మరణాల్లో బాలికల మరణాలే ఎక్కువగా ఉండటం అని చెబుతున్నారు.

గర్భస్రావం చేయించడాన్ని నిషేధిస్తూ భారత్ చట్టం తీసుకురావడం వల్ల ఈ నిష్పత్తి కొంచెం తక్కువగానే ఉందని, అయితే, ఐదేళ్ల లోపు మరణాలే బాలబాలికల నిష్పత్తి తగ్గడానికి మరోకారణం అవుతోందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఐదేళ్లు వచ్చేసరికి దాదాపు 93 మంది బాలురు చనిపోతుంటే బాలికలు మాత్రం 100 మంది చనిపోతున్నారట. ఇండియాలో మగపిల్లలు కలిగి ఉండటాన్ని ఒక సాంప్రదాయంగా భావిస్తారని, అబ్బాయిలపై తీసుకున్న శ్రద్ధ అమ్మాయిలపై తీసుకోరని, ఇదే బాలికల మరణాలు సంభవించడానికి మరో ప్రధాన కారణం అవుతోందని నివేదిక వెల్లడించింది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని వెంటనే వారి సంరక్షణ చర్యలు తీసుకోవాలని సూచించింది.

మరిన్ని వార్తలు