కల్తీ ‘కల్లో’లం

14 Sep, 2015 02:19 IST|Sakshi
కల్తీ ‘కల్లో’లం

* వింత ప్రవర్తనతో ఆసుపత్రుల పాలవుతున్న బాధితులు
* నిజామాబాద్ జిల్లాలో రోజురోజుకూ పెరుగుతున్న రోగులు
* రెండ్రోజుల్లోనే ఆసుపత్రికి 96 మంది.. వివిధ చోట్ల మరో 200 మంది
* ఆసుపత్రుల్లో పిచ్చి ప్రవర్తన.. మంచాలకు కట్టేసి చికిత్స
* కల్లులో మత్తు మోతాదు తగ్గడమే కారణం

 
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: కొందరు ఉన్నట్టుండి కింద పడిపోతున్నారు.. ఇంకొందరు అకస్మాత్తుగా పిచ్చిపట్టినట్టుగా మారిపోతున్నారు.. మరికొందరు దొరికిన వారిని దొరికినట్టు కొరుకుతున్నారు! నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో ఈ దృశ్యాలు ఇప్పుడు సర్వసాధారణమయ్యాయి!! ఇన్నాళ్లూ కల్తీ కల్లుకు బానిసలైన వారంతా... ఒక్కసారిగా అది దొరక్కపోవడంతో ఇలా చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. వింత ప్రవర్తన, అనారోగ్యంతో ఆసుపత్రుల పాలవుతున్నారు.
 
 రెండ్రోజుల్లోనే నిజామాబాద్ పట్టణంలో బాధితుల సంఖ్య 96కు చేరింది. వీరంతా ప్రభుత్వాసుపత్రిలో చేరగా.. వైద్యులు తాళ్లతో మంచాలకు కట్టేసి వారికి చికిత్సలు చేస్తున్నారు. కల్తీకల్లులో మత్తు పదార్థమైన క్లోరల్ హైడ్రేట్, డైజోఫాంకు ఒక్కసారిగా దూరమవడంతో బాధితులు ఇలా ప్రవర్తిస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. మొదట ఆదిలాబాద్ జిల్లా నిర్మల్, భైంసా, బాసర, ఆదిలాబాద్‌లో బాధితులు వింతవింతగా ప్రవర్తించారు. ఇప్పుడు నిజామాబాద్ జిల్లా బాన్సువాడ, కామారెడ్డి, బోధన్, ఆర్మూరు, నిజామాబాద్‌లో ఇలాంటి వారు రోజురోజుకూ ఎక్కువైపోతున్నారు.
 
 జిల్లాలో ఇదీ పరిస్థితి..
 నిజామాబాద్ జిల్లాలో కొన్నేళ్లుగా పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులు కల్తీ కల్లు దందా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల గుడుంబా, నాటుసారా, కల్తీకల్లుపై ఉక్కుపాదం మోపింది. ఈ నేపథ్యంలో సీనియర్ ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్‌ను ఇన్‌చార్జిగా నియమించింది. ఆయన ఆదేశాల మేరకు గత ఐదారు రోజులుగా కల్తీకల్లు నిరోధానికి ఎక్సైజ్ అధికారులు వరుసగా దాడులు చేస్తున్నారు. ఫలితంగా కల్లులో క్లోరల్ హైడ్రేట్, డైజోఫాంను కల్లు తయారీదారులు వినియోగించడం లేదు. దీంతో అవి ఉన్న కల్లుకు అలవాటుపడిన వారికి మత్తు ఒక్కసారిగా తగ్గడంతో వింతగా ప్రవర్తిస్తున్నారు. మాక్లూర్ మండలం కల్లెడికి చెందిన ఓ వ్యక్తి పిచ్చి ప్రవర్తనతో ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. నిజామాబాద్ మండలంలోని కులాస్‌పూర్, కులాస్‌పూర్‌తాండలో 8 మంది విచిత్ర చేష్టలు చేస్తున్నారు.
 
 బోధన్ మండలం ఎడపల్లితోపాటు బాన్సువాడ, ఆర్మూర్, మాక్లూర్, నిజామాబాద్ మండలంలోని కొన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లా కేంద్రంలోని దుబ్బ, ఆదర్శనగర్, కోటగల్లి, గౌతంనగర్ ప్రాంతాల్లో సుమారు 30 మందికిపైగా ఆసుపత్రిపాలయ్యారు. మొత్తమ్మీద ప్రభుత్వాసుపత్రిలో 96 మంది బాధితులు చేరగా.. జిల్లావ్యాప్తంగా మరో 200 మంది వివిధ ఆసుపత్రుల్లో చేరారు. వీరిలో 22 మంది మహిళలు కూడా ఉన్నారు. బాధితులు మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు.
 
 ఇన్నేళ్లుగా మౌనం

 ఇన్నాళ్లూ ఎక్సైజ్ అధికారుల అండతో  కల్లీ కల్లు వ్యాపారం యథేచ్ఛగా సాగింది. కల్తీ కల్లు తాగి మరణించినా, అస్వస్థతకు గురైనా నమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపి చేతులు దులుపుకునేవారు. నిజామాబాద్ ఎక్సైజ్ యూని ట్  పరిధిలో 19 మండలాలు, 166 కల్లు గీత సహకార సంఘాలు, 306 కల్లు గీత కార్మికులు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. కామారెడ్డి పరిధిలో 117 గీత సహకార సంఘాలు, 296 టీఎఫ్‌టీలు ఉన్నాయి. జిల్లాలో ఎక్కడ చూసినా గీత వృత్తితో సంబంధం లేని వ్యక్తులే ‘కల్లు మాఫియా’గా అవతారమెత్తారు. ఆబ్కారీ శాఖ పట్టించుకోక పోవడంతో డైజోఫాం, క్లోరల్ హైడ్రేడ్, క్లోరోఫాం (మత్తుకోసం), శక్రీన్ (రుచి కోసం), తెల్లపౌడర్, కుంకుడు రసంతో తయారు చేసిన కల్లు విక్రయాలు జోరుగా సాగాయి.
 
 మత్తు లేక పిచ్చి ప్రవర్తన
నిజామాబాద్‌లోని గౌతంనగర్‌కు చెందిన ఈ మేస్త్రీ  పేరు మదన్.  రోజూ ఉదయం, సాయంత్రం కల్లు తాగే అలవాటుంది. నాలుగు రోజులుగా కల్లులో మత్తు పదార్థాలు లేకపోవడంతో విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పిస్తే అక్కడా నిలకడగా ఉండడం లేదు. అరవడం, కాళ్లు, చేతులు వంకర పోవడం, బయటకు పరుగెత్తడం వంటి చేష్టలు చేస్తున్నాడు. దీంతో వైద్యులు మంచానికి కట్టేసి చికిత్స చేస్తున్నారు.
 
 మత్తు తగ్గడం వల్లే
 కల్లుకు బానిస అయిన వారు అందులో మత్తు పదార్థాల మోతాదు తగ్గడంతో ఇలా ప్రవర్తిస్తుంటారు. ఉన్నట్టుండి కల్లు అందుబాటులో లేకపోవడంతో కూడా ఇలా మారుతుంటారు. కల్తీ కల్లు తాగడంతో నరాలు బలహీనపడడం, మెదడు మొద్దుబారడం, ఫిట్స్ రావడం వంటివి జరుగుతాయి.
- డాక్టర్ విశాల్, మానసిక వైద్య నిపుణులు

మరిన్ని వార్తలు