రాష్ట్రంలో మరిన్ని సాఫ్ట్‌వేర్ పార్కులు

12 Dec, 2013 01:22 IST|Sakshi
రాష్ట్రంలో మరిన్ని సాఫ్ట్‌వేర్ పార్కులు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ ఎగుమతులను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో మరిన్ని సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్కులు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఆరు పార్కులున్నాయి. త్వరలో 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విజయవాడలో పార్కు అందుబాటులోకి రానుంది. దీని తర్వాత వైజాగ్, తిరుపతితోపాటు ఇతర నగరాల్లో పార్కులను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా(ఎస్‌టీపీఐ) డెరైక్టర్ జనరల్ ఓంకార్ రాయ్ బుధవారమిక్కడ తెలిపారు. ఇట్స్‌ఏపీ 22వ వార్షిక అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 10 పార్కులు రెండేళ్లలో అందుబాటులోకి వస్తాయని, ఇందులో విజయవాడ ఒకటని చెప్పారు. మొత్తంగా సుమారు రూ.300 కోట్లు ఖర్చు చేస్తామని వివరించారు. ఎస్‌టీపీఐ పార్కుల్లో 10 వేల ఐటీ కంపెనీలు నమోదయ్యాయి. ఇందులో 3,750 కంపెనీలు ఎగుమతులు చేస్తున్నాయి. 2012-13లో ఈ కంపెనీల ఎగుమతుల విలువ రూ.2.51 లక్షల కోట్లు. వృద్ధి 10 శాతముంది.
 
 ఇంటర్నెట్ ఉచితం..: వైజాగ్, కాకినాడ, విజయవాడ, వరంగల్, తిరుపతి నగరాల్లోని ఇంక్యుబేషన్ సెంటర్లలో ఏర్పాటయ్యే నూతన కంపెనీలకు ఏడాదిపాటు ఉచిత ఇంటర్నెట్ సౌకర్యాన్ని ఇవ్వనున్నట్టు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఈ సందర్భంగా తెలిపారు. అలాగే ఆరు నెలలపాటు అద్దె కట్టనక్కరలేదని చెప్పారు. ఆ తర్వాత ఆరు నెలల కాలానికి ప్రభుత్వం నిర్దేశించిన అద్దెలో సగం చెల్లిస్తే చాలని పేర్కొన్నారు. కాగా, 23 విభాగాల్లో ఇట్స్‌ఏపీ అవార్డులను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఐటీఈ అండ్ సీ విభాగం కార్యదర్శి సంజయ్ జాజు, రిసెర్చ్ సెంటర్ ఇమారత్ డెరైక్టర్ జి.సతీష్ రెడ్డి, ఇట్స్‌ఏపీ ప్రెసిడెంట్ వి.రాజన్న మాట్లాడారు.

>
మరిన్ని వార్తలు