బందిపోటు దొంగ బ్యాంకుకు వచ్చి...

18 Nov, 2016 18:59 IST|Sakshi
బందిపోటు దొంగ బ్యాంకుకు వచ్చి...
మల్ఖన్ సింగ్... ఈ పేరు చెబితేనే గ్వాలియర్ పరిసర ప్రాంత వాసులు వణికిపోయేవారు. అంత పేరుమోసిన గజదొంగ అతడు. అలాంటి గజదొంగ.. బ్యాంకుకు వచ్చాడు. వచ్చేటప్పుడు కూడా అతడి తుపాకి భుజాన వేలాడుతూనే ఉంది. మెడలో సెల్‌ఫోన్ కూడా దండలా వేసుకున్నాడు. బట్టతల, బుర్రమీసాలతో ఉన్న మల్ఖన్ సింగ్‌ను చూసేసరికి బ్యాంకు సిబ్బందితో పాటు అక్కడున్న వినియోగదారులు కూడా ఒక్కసారి భయపడ్డారు. తీరా.. అతడు ఎందుకు వచ్చాడా అని చూస్తే, తన దగ్గర ఉన్న పాత కరెన్సీ నోట్లను మార్చుకోడానికి వచ్చినట్లు తెలిసింది. 1970-80 ప్రాంతాలలో అతడు పేరుమోసిన గజదొంగ. అతడి మీద, అతడి ముఠా సభ్యుల మీద కలిపి దాదాపు 94 కేసులు నమోదై ఉన్నాయి. వాటిలో 18 దోపిడీ, 28 కిడ్నాపులు, 19 హత్యాయత్నాలు, 17 హత్యకేసులు కూడా ఉన్నాయి. చంబల్ పరిసర ప్రాంతాల్లో అతడి పేరు చెబితే మంచినీళ్లు తాగడానికి కూడా భయపడేవారు. ఆ తర్వాత.. 1983 సంవత్సరంలో అతడు తన వాళ్లతో కలిసి నాటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అర్జున్ సింగ్ ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోయాడు. 
 
1976 ప్రాంతంలో మల్ఖన్ సింగ్‌కు, నాటి బిలావో గ్రామ సర్పంచి కైలాష్ నారాయణ్‌కు పెద్ద గొడవ జరగడంతో అతడి గురించి అందరికీ తెలిసింది. నారాయణ్‌ను మిషన్‌గన్‌తో కాల్చి చంపడానికి ప్రయత్నించి, చివరకు అతడి అనుచరులిద్దరిని గాయపరిచి, ఒకరిని చంపేశాడు. నారాయణ్‌కు కూడా ఆరు బుల్లెట్లు తగిలినా, ప్రాణాలు మాత్రం నిలబడ్డాయి. ఆ ఘటన తర్వాత కొన్నాళ్లపాటు మల్ఖన్ సింగ్ యూపీలోని జలౌన్ ప్రాంతానికి పారిపోయాడు. 
 
అప్పటినుంచి యూపీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పాటు బుందేల్‌ఖండ్ ప్రాంతంలో అతడిపేరు మార్మోగిపోయింది. ఇటీవలే ప్రముఖ దర్శకుడు ముఖేష్ ఆర్ చౌక్సే మల్ఖన్ సింగ్ మీద ఒక సినిమా కూడా తీశాడు. లొంగిపోయిన తర్వాత తన సొంత గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ, తరచు ఆధ్యాత్మిక సభలలో పాల్గొంటున్నాడు. అయితే ఇప్పటికీ తన ఆత్మరక్షణ కోసం మాత్రం తుపాకి వెంట తీసుకునే వెళ్తుంటాడు. 
మరిన్ని వార్తలు