బ్యాంకు, రియాల్టీలకు ఉర్జిత్ షాక్!

12 Dec, 2016 14:44 IST|Sakshi
బ్యాంకు, రియాల్టీలకు ఉర్జిత్ షాక్!
పెద్ద నోట్ల రద్దు అనంతరం వెలువరించే మొదటిపాలసీపై భారీగా ఆశలు పెట్టుకున్న రేట్ సెన్సిటివ్ రంగాల షేర్లకు ఆర్బీఐ షాకిచ్చింది. కీలక వడ్డీరేట్లు రెపోను, రివర్స్ రెపోను యథాతథంగా ఉంచుతున్నట్టు ప్రకటించడంతో ఆ రంగాల షేర్లన్నీ కుప్పకూలాయి. ముఖ్యంగా బ్యాంకు షేర్లలో కొనసాగుతున్న లాభాలన్నీ ఈ ప్రకటనతో  తుడిచిపెట్టుకుపోయాయి. ఆర్బీఐ పాలసీ ప్రకటన ముందు వరకు లాభాల్లో నడిచిన కెనరా బ్యాంకు, ఐడిబీఐ,  ఓబీసీ, పీఎన్బీ, కొటక్ మహింద్రా, సిండికేట్, యూనియన్ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ బరోడా, ఎస్బీఐలు నష్టాల్లోకి జారుకున్నాయి. వీటిలో అత్యధికంగా బ్యాంకు ఆఫ్‌ బరోడా, ఎస్బీఐలు పడిపోయాయి. దీంతో నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్ 1 శాతం క్షీణించి 17,953  పాయింట్లకు దిగజారింది..
 
అయితే డిసెంబర్ 10 నుంచి పెంచిన ఇంక్రిమెంటల్ సీఆర్ఆర్ను ఉపసంహరించుకోనున్నట్టు ఆర్బీఐ వెల్లడించింది. మరోవైపు రియల్ ఎస్టేట్ సెక్టార్ షేర్లు హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్, డీఎల్ఎఫ్, గోద్రెజ్ ప్రాపర్టీస్ 1శాతం నుంచి 3 శాతం వరకు పడిపోయాయి. అయితే నిఫ్టీ ఆటో ఇండెక్స్ మాత్రం ఆర్బీఐ ప్రకటనకు తన లాభాలను చేజార్చుకోలేదు. ఈ  ఇండెక్స్ 0.56 శాతం లాభాల్లోనే నడుస్తోంది. పెద్ద నోట్ల రద్దు అనంతరం నిఫ్టీ రియాల్టీ(16శాతం), నిఫ్టీ ఆటో(11శాతం), నిఫ్టీ బ్యాంకు(5.5శాతం)లు పడిపోయాయి. కాగ, ఆర్బీఐ నేడు వెలువరించిన పాలసీ సమీక్షలో రెపోను 6.25గా, రివర్స్ రెపోను 5.75గా ఉంచుతున్నట్టు ప్రకటించింది. ఈ ప్రకటన మార్కెట్లన్నీ దెబ్బకొట్టింది. 
మరిన్ని వార్తలు