ఐసిస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

3 Nov, 2016 18:09 IST|Sakshi
ఐసిస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

గోగ్జాలీ: ఐసిస్ పట్టుకలిగిన ఇరాక్ లోని మోసుల్ నగరంలో భద్రతా దళాలను అడ్డుకోవాలని ఐసిస్ అధినేత అబు బకర్ అల్ బగ్దాది ఉగ్రవాదులకు గురువారం పిలుపునిచ్చాడు. ఈ మేరకు ఆన్ లైన్ లో బగ్దాది ఆడియో టేపు హల్ చల్ చేస్తోంది. బలగాలకు భయపడి వెనక్కు తిరగడం కన్నా పోరాడటమే వెయ్యిరెట్లు ఉత్తమమని టేపులో వ్యాఖ్యానించాడు. బలగాల బలహీనతలు తెలుసుకోవాలని ఉగ్రవాదులకు సూచించాడు. 

మోసుల్ యుద్ధంలో ఐసిస్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. అమెరికా, ఇరాక్ సేనలను ఓడిస్తామని పేర్కొన్నాడు. 2014 జూన్ లో ఇరాక్ లోని కీలక నగరాలను తన అదుపులోకి తీసుకున్న సందర్భంగా బగ్దాది ఇస్లామిక్ స్టేట్ ను స్ధాపిస్తున్నట్లు ప్రకటించాడు. కాగా గత ఏడాది నుంచి ఐసిస్ పతనం ప్రారంభమైందని చెప్పొచ్చు. అప్పటినుంచి ఐసిస్ ఆధీనంలోని నగరాలను ఒక్కొక్కటిగా సాయుధ బలగాలు తిరిగి తమ స్వాధీనంలోకి తీసుకుంటున్నాయి.

గత వారమే అమెరికా, ఇరాక్ లకు చెందిన సాయుధ బలగాలు మోసుల్ నగరంలోకి ప్రవేశించాయి. మోసుల్ లో బగ్దాది దాగివున్న స్ధావరాన్ని బలగాలు చుట్టుముట్టాయనే వార్తలు కూడా వచ్చాయి. సౌదీ అరేబియాతో పాటు టర్కీలో కూడా ఉగ్రదాడులు చేయాలని ఆడియోలో బాగ్దాది పేర్కొన్నాడు. సిరియా, ఇరాక్ లకు రాలేని సానుభూతిపరులు లిబ్యాను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలని సూచించాడు. ఆపద సమయాల్లో ఐసిస్ ఫైటర్లందరూ కలిసికట్టుగా పోరాడాలని కోరాడు. 

మరిన్ని వార్తలు