అమెరికాలో మోదీ ఎఫెక్ట్.. ఓ తల్లి ఆదర్శం

23 Feb, 2017 17:19 IST|Sakshi
అమెరికాలో మోదీ ఎఫెక్ట్.. ఓ తల్లి ఆదర్శం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన స్వచ్ఛ భారత్ నినాదం అమెరికాను కూడా తాకినట్లుంది. పెన్సల్వేనియాకు చెందిన ఓ విద్యార్థి.. ఇంటికి వెళ్లినప్పుడు ఇంట్లో చెత్త అంతా ఎక్కడ పడితే అక్కడ పారేశాడు. అక్కడి నుంచి మళ్లీ కాలేజికి వెళ్లిపోయాడు. దాంతో అతగాడి తల్లి అతడికి మర్చిపోలేని బహుమతి ఒకటి పంపారు. 18 ఏళ్ల వయసున్న కానార్ కాక్స్ అనే విద్యార్థి హాస్టల్లో ఉండగా అతడికి తన తల్లి నుంచి రెండు బాక్సులలో పార్సిల్స్ వచ్చాయి. న్యూ విల్మింగ్‌టన్ ప్రాంతంలోని వెస్ట్ మినిస్టర్ కాలేజిలో అతడు చదువుతున్నాడు. 
 
అమ్మ ఏం పంపిందా అని ఆసక్తిగా చూసేసరికి ఒక దాంట్లో బొమ్మలు, ఆహార పదార్థాలు.. ఇలాంటివన్నీ ఉన్నాయి. రెండో దాంట్లో మాత్రం మొత్తం చెత్త ఉంది. పొరపాటున ఏమైనా పంపిందేమోనని అతడు తన తల్లికి ఫోన్ చేశాడు. కానీ ఆమె మాత్రం.. ''అబ్బే పొరపాటు ఏమీ లేదు. అదంతా నువ్వు మొన్న వచ్చినప్పుడు ఎత్తాల్సిన చెత్త'' అని సమాధానం ఇచ్చారు. అప్పుడు పారబోయలేదని దాన్నంతటినీ ప్యాక్ చేసి మరీ పంపారన్న మాట. అది చూసిన కాక్స్.. ఆ విషయాన్ని పదిమందికీ చెప్పాలన్న ఉద్దేశంతో ఆ చెత్తతో నిండిన పెట్టెను ఫొటో తీసి ట్విట్టర్‌లో కూడా పోస్ట్ చేశాడు.
మరిన్ని వార్తలు