సీఎంతో సంభాషణ రికార్డు చేశా

19 Sep, 2015 01:24 IST|Sakshi
సీఎంతో సంభాషణ రికార్డు చేశా

వ్యాపమ్‌ను బయటపెట్టిన ఆనంద్ రాయ్ వెల్లడి
* ఆనంద్ రాయ్, ఆయన భార్యను బదిలీ చేసిన ప్రభుత్వం
* కొద్ది గంటల్లోనే యూ టర్న్
ఇండోర్: వ్యాపమ్ స్కామ్‌ను బయటపెట్టిన ఆనంద్ రాయ్ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో తన సంభాషణను రహస్యంగా రికార్డు చేశారనే విషయం వెలుగు చూసింది. ఆగస్టు 11న సీఎం అధికారిక నివాసంలో రాత్రి 9.45 నుంచి 10.50 దాకా చౌహాన్‌తో భేటీ అయ్యానని, తమ  సంభాషణను చేతి గడియారంలోని కెమెరాతో రహస్యంగా రికార్డు చేశారని ఆనంద్ శుక్రవారం తెలిపారు.

ప్రభుత్వం సీఎంతో తన భేటీని రహస్యంగా రికార్డు చేసి... వారికి పనికొచ్చే భాగాలనే విడుదల చేస్తుందనే ఉద్దేశంతోనే తానీ పని చేశానని,  బ్లాక్‌మెయిల్ చేసేందుకు కాదని అన్నారు. స్కాంపై తన పోరాటం కొనసాగుతుందన్నారు. అయితే శుక్రవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. డాక్టర్లయిన ఆనంద్ రాయ్, గౌరి  దంపతులను ప్రభుత్వం ఇండోర్ నుంచి బదిలీ చేసింది. కొద్ది గంటల్లోనే ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకుంది.

పరపతి ఉన్న మంత్రులు, బీజేపీ నేతలపై తాను ఫిర్యాదు చేసినందువల్లే కక్షసాధించేందుకు ప్రభుత్వం తమను బదిలీ చేసిందని ఆనంద్  ఆరోపించారు. స్కాంలో తన పేరును, కుటుంబ సభ్యుల పేర్లను బయటపెట్టకూడదనే షరతుతో చౌహాన్ తమ బదిలీ ఉత్తర్వులను ఉపసంహరించారన్నారు. సంభాషణను బయటపెడతారా? అని విలేకర్లు అడగ్గా ‘అలా చేయడం నైతికత అనిపించుకోదు’ అని రాయ్ బదులిచ్చారు.

మరిన్ని వార్తలు