ఇప్పుడు గర్వంగా చెప్పొచ్చు: ధోని

23 Jun, 2016 18:59 IST|Sakshi
ఇప్పుడు గర్వంగా చెప్పొచ్చు: ధోని

హరారే: మరి కొంతమంది యువ క్రికెటర్లు వెలుగులోకి రావడానికి జింబాబ్వే పర్యటన ఉపయోగపడిందని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్పష్టం చేశాడు. ఈ పర్యటన ద్వారా చాలా మంది యువకులు తమ సత్తాను నిరూపించుకోవడంతో జట్టు బలాన్ని మరింత పటిష్టం చేసిందన్నాడు. మరోవైపు  ఈ పర్యటన  ఎన్నోవిషయాలను నేర్చుకోవడానికి దోహదపడిందన్నాడు.  జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్ కంటే,  టీ 20 సిరీస్తోనే తాము ఎక్కువగా నేర్చుకున్నామన్నాడు. ఏకపక్షంగా సాగిన వన్డే సిరీస్ కంటే, పొట్టి ఫార్మాట్లో జింబాబ్వే పోరాడిన తీరు అమోఘమని ధోని పేర్కొన్నాడు. తొలి టీ 20ని కోల్పోయి, మూడో మ్యాచ్లో కూడా దాదాపు ఓటమి అంచుల వరకూ వెళ్లడం జట్టుకు ఒక గుణపాఠమన్నాడు.  ఈ తరహా అనుభవాలతోనే ఎక్కువ విషయాలు నేర్చుకునే అవకాశం ఉందన్నాడు.

' జింబాబ్వే పర్యటనతో యువ క్రికెటర్ల ప్రతిభ వెలుగులోకి వచ్చింది. టీ 20 సిరీస్తో చాలా నేర్చుకున్నాం. పొట్టి ఫార్మాట్లో జింబాబ్వే అదరగొట్టింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లో జింబాబ్వే మెరుగ్గా రాణించింది. ఇంకా వారు కొన్ని మ్యాచ్లాడితే తప్పకుండా ఫామ్లోకి వస్తారు. వన్డే సిరీస్ను దిగ్విజయంగా ముగించిన తరువాత తొలి టీ 20లో ఊహించని షాక్ తగిలింది. దాంతో పూర్తిస్థాయిలో సన్నద్దమయ్యాం. ఎటువంటి తప్పిదాలకు ఆస్కారం ఇవ్వకూడదనుకున్నాం. అయినప్పటికీ జింబాబ్వే బాగా రాణించింది' అని  ధోని తెలిపాడు.

ప్రత్యేకంగా బౌలింగ్ విభాగంలో టీమిండియా ఆకట్టుకుందన్నాడు. గతంలో భారత జట్టుకు పేస్ బౌలింగ్ కొరత విపరీతంగా ఉండేదన్నాడు. అది క్రమేపీ పెరుగుతూ  రావడం నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామన్నాడు. ఇప్పుడు టీమిండియా జట్టులో 10 నుంచి 12 మంది వరకూ పేస్ బౌలర్లు ఉన్నారని గర్వంగా చెప్పవచ్చని ధోని అభిప్రాయపడ్డాడు.

మరిన్ని వార్తలు