సంపదలో ముఖేష్‌ సంచలన రికార్డు

20 Oct, 2016 19:11 IST|Sakshi
సంపదలో ముఖేష్‌ సంచలన రికార్డు
  • ఒక దేశ జీడీపీతో సమానమైన సంపద ఆర్జించిన వ్యక్తిగా రికార్డు
  • పోర్బ్స్‌ జాబితాలో వరుసగా తొమ్మిదో ఏడాది మొదటిస్థానం

  • న్యూఢిల్లీ: దేశంలో అత్యంత సంపన్నుడిగా వరుసగా తొమ్మిదో ఏడాది అగ్రస్థానంలో నిలిచిన పారిశ్రామికవేత్త ముఖేశ్‌ అంబానీ మరో ఘనతను సొంతం చేసుకున్నారు. ఆయన సంపద ఏకంగా ఒక దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)తో సమానం కావడం గమనార్హం. 22.7 బిలియన్‌ డాలర్ల (రూ. లక్షన్నర కోట్ల) సొమ్ముతో ఈస్టోనియా జీడీపీకి సమానమైన సంపదను ఆయన కలిగి ఉన్నారని ఫోర్బ్స్‌ ఇండియా వెల్లడించింది.

    దేశంలో అత్యంత సంపన్నులతో కూడిన జాబితాను ఫోర్బ్స్‌ విడుదల చేసింది. ఈ జాబితాలో వరుసగా తొమ్మిదో ఏడాది ముఖేశ్‌ మొదటి స్థానంలో నిలువగా.. నాలుగోస్థానంలో నిలిచిన విప్రో అధినేత అజీమ్‌ ప్రేమ్‌జీ సంపద.. మొజాంబిక్‌ జీడీపీ కన్నా అధికం కావడం గమనార్హం. మొజాంబిక్‌ జీడీపీ 14.7 బిలియన్‌ డాలర్లు (రూ. 98వేల కోట్లు) కాగా.. ప్రేమ్‌జీ సంపద 15 బిలియన్‌ డాలర్లు (రూ. లక్షకోట్లు).

    ఇక దేశంలో అత్యంత సంపన్నుల జాబితాలో 16.9 బిలియన్‌ డాలర్ల (రూ. 1.12 లక్షల కోట్ల)తో సన్‌ ఫార్మా అధినేత దిలీప్‌ శాంఘ్వీ రెండోస్థానంలో నిలువగా.. హిందూజా కుటుంబ వ్యాపార సంస్థ 15.2 బిలియన్‌ డాలర్ల (రూ. 1.01 లక్షల కోట్ల)తో నాలుగోస్థానంలో నిలిచింది. 13.90 బిలియన్‌ డాలర్ల (రూ. 92వేల కోట్ల)తో పళ్లోంజీ మిస్త్రీ ఐదో సంపన్న భారతీయుడిగా ఈ జాబితాలో చోటు సాధించారు. ఈ ఐదుగురు భారతీయుల సంపద మొత్తం కలిస్తే.. అది 83.7 బిలియన్‌ డాలర్లు (రూ. 5.59 లక్షల కోట్లు) అవుతుందని, అంగారక గ్రహంపై వెళ్లేందుకు ఉద్దేశించిన ‘మంగల్‌యాన్‌’ వ్యోమనౌకను 1230 సార్లు పంపేందుకు అయ్యే ఖర్చు కన్నా ఇది అధికమని, ఈ సందపతో 18సార్లు రియో ఒలింపిక్స్‌ను నిర్వహించవచ్చునని ఫోర్బ్స్‌ మ్యాగజీన్‌ పేర్కొంది.

    మొత్తం టాప్‌ వందమంది సంపన్న భారతీయులతో కూడిన జాబితాను ఫోర్బ్స్‌ విడుదల చేసింది. ఈ జాబితాలో చోటు సంపాదించేందుకు కనీస సంపద 1.25 బిలియన్‌ డాలర్ల (రూ. 8,300 కోట్ల)ను కటాఫ్‌గా నిర్ణయించింది. ఇది గత ఏడాది 1.1 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 2015లో టాప్‌ -10లో నిలిచిన కుబేరులే ఈ ఏడాది కూడా అటు-ఇటు మార్పులతో టాప్‌-10లో నిలువడం గమనార్హం.  84.6, 82.6శాతం సంపద వృద్ధితో ఈ జాబితాలో టాప్‌ గెయినర్లుగా కేపీ సింగ్‌ (4.80 బిలియన్‌ డాలర్లు/రూ. 32వేల కోట్లు), అజయ్‌ పిరమల్‌ (3.25 బిలియన్‌ డాలర్లు/రూ. 21వేల కోట్లు) నిలిచారు. అయితే, ఫ్లిప్‌కార్ట్‌ అధినేతలు సచిన్‌, బిన్నీ బన్సాల్‌ ఈ ఏడాది జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు. టెక్‌ దిగ్గజమైన తురాఖియా బ్రదర్స్‌, పతంజలి గ్రూప్‌ అధినేత, రాందేవ్‌ అనుచరుడు బాలకృష్ణన్‌ కొత్తగా ఈ జాబితాలో చోటు సాధించారు.
     

మరిన్ని వార్తలు