‘మా నాన్నకు నామీదే కోపం, ఆయన మీద కాదు’

30 Jun, 2017 13:32 IST|Sakshi
‘ములాయం కోపం నా మీదే, ఆయన మీద కాదు’

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌ మరోసారి తన బాబాయి రాంగోపాల్‌ యాదవ్‌పై మీద ప్రశంసల జల్లు కురిపించారు. సమాజ్‌వాదీ పార్టీతో పాటు ఎన్నికల చిహ్నాన్ని కూడా ఆయనే కాపాడారని అన్నారు. కాగా నిన్న (గురువారం) రాంగోపాల్‌ యాదవ్‌ పుట్టినరోజు వేడుకల కార్యక్రమంలో అఖిలేష్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాంగోపాల్‌ యాదవ్‌ నేతృత్వంలో తమ ప్రభుత్వం అనేక  అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసిందన్నారు. అయితే ఈ వేడుకకు ములాయం సింగ్‌ యాదవ్‌తో పాటు మరో సోదరుడు శివపాల్‌ యాదవ్‌ కూడా దూరంగా ఉన్నారు.

దీనిపై విలేకరులు అడిగిన ప్రశ్నకు అఖిలేష్‌ సమాధానం ఇస్తూ ‘ వాళ్లు ఎందుకు రాలేదో నాకు తెలుసు. మిగతా వాళ్ల మీద కన్నా నా మీదే కోపం’ అని తెలిపారు. అయితే తండ్రితో విభేదించి యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసినప్పటికీ అఖిలేష్‌ మాత్రం తన చిన్నాన్నపై ఏ మాత్రం విశ్వాసం తగ్గలేదు సరికదా, ఆయన వల్లే తాము అధికారంలో ఉన్నప్పుడు క్లిష్టమైన పనులను కూడా పూర్తి చేశామన్నారు. మరోవైపు రాంగోపాల్‌ యాదవ్‌ కూడా అఖిలేష్‌పై తన వాత్సల్యాన్ని ప్రదర్శించారు. 2022లో తిరిగి అఖిలేష్‌ ముఖ్యమంత్రి అయ్యేందుకు ఇప్పటి నుంచి పని చేయాలంటూ ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

కాగా తన కుమారుడు అఖిలేష్ యాదవ్‌ను తప్పుదోవపట్టిస్తున్నాడని వరుసకు సోదరుడయ్యే రాంగోపాల్‌ యాదవ్‌పై ములాయం సింగ్‌ యాదవ్‌ ఆగ్రహంగా ఉన్న విషయం విదితమే. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలకు ముందు సమాజ్‌వాదీ పార్టీ ఆధిపత్యం కోసం ములాయం సింగ్‌, అఖిలేష్‌ మధ్య జరిగిన పోరులో అఖిలేషే పై చేయి సాధించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్ల కేటాయింపుల్లో విభేదాలు రావడంతో అఖిలేష్‌, రాంగోపాల్‌ ఓ వర్గంగా.. ములాయం, శివపాల్‌ మరో వర్గంగా విడిపోయిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు