పాపం పెద్దాయనకు దారేదీ?

17 Jan, 2017 09:28 IST|Sakshi
పాపం పెద్దాయనకు దారేదీ?
కొడుకు మీద నిప్పులు చెరుగుతూ.. అవసరమైతే తాను స్వయంగా అసెంబ్లీ ఎన్నికల రంగంలోకి దిగుతానని, తన కుమారుడి మీద తానే పోటీ చేస్తానని ప్రకటించిన ములాయం సింగ్ యాదవ్ ఆ తర్వాత ఎన్నికల కమిషన్ నిర్ణయం వెలువడగానే ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. కొడుకు, కోడలు తన ఇంటికి వచ్చి ఆశీర్వాదం కోరగానే వాళ్లకు ఆశీస్సులు ఇచ్చి, అభినందనలు కూడా తెలిపారు. కొడుకు తనతో ఒక్క నిమిషం కూడా మాట్లాడటం లేదని కొన్ని గంటల ముందే చిన్నబుచ్చుకున్న పెద్దాయన... ఆ తర్వాత భార్యతో సహా వచ్చిన కొడుకుతో సుదీర్ఘంగానే మాట్లాడినట్లు తెలుస్తోంది. 
 
ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారన్న విషయం అయితే బయటకు రాలేదు గానీ, ఎన్నికల కమిషన్ నిర్ణయం వచ్చిన తర్వాత ములాయం సింగ్ కాస్త మెత్తబడ్డట్లే కనిపిస్తోంది. అంతకుముందు వరకు సమాజ్‌వాదీ పార్టీని గానీ, ఎన్నికల గుర్తును గానీ వదులుకునేది లేదని చెప్పినా, ఇప్పుడు అలాంటి అవకాశం ఏమీ లేకపోవడం, మరోవైపు తొలి దశ ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా మంగళవారమే వెలువడుతుండటంతో తదుపరి కార్యాచరణ ఏం చేయాలో తెలియని డిఫెన్స్ పరిస్థితిలోకి ములాయం పడిపోయారు. ఎలాగైనా సైకిల్ గుర్తు తమకు వస్తుందన్న నమ్మకంతో ఉన్న పెద్దాయన.. ఇప్పుడు అది కాస్తా కొడుకు నేతృత్వంలోని వర్గానికి వెళ్లిపోవడంతో ఇక తన వద్ద మిగిలిన కొద్దిమంది నాయకులతో ఏం చేయాలోనని మల్లగుల్లాలు పడుతున్నారు. వరుసకు తమ్ముడయ్యే రాంగోపాల్ యాదవ్ (ప్రొఫెసర్ సాబ్) దగ్గరుండి మరీ కొడుక్కి సైకిల్ గుర్తును, పార్టీని వచ్చేలా చేయడంతో ఒకవైపు కారాలు మిరియాలు నూరుతున్నా, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. 
 
ఏరికోరి తెచ్చుకున్న సీనియర్ నాయకుడు అమర్‌సింగ్ తాను ఎన్నికలు అయిపోయే వరకు రాష్ట్రంలో కాదు కదా అసలు దేశంలోనే ఉండనని, లండన్ వెళ్లిపోతున్నానని చెప్పడం ఆయనను మరింత ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు శివపాల్ యాదవ్ తప్ప పెద్దగా చెప్పుకోదగ్గ నాయకులెవరూ ములాయం దగ్గర లేరు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలలో కూడా చాలామంది అఖిలేష్ వర్గానికి మద్దతుగా ఇప్పటికే అఫిడవిట్లు సమర్పించారు. ఇప్పుడు పార్టీ గుర్తు, జెండా ఉంటే తప్ప ఎన్నికల్లో పోటీ సాధ్యం కాదు కాబట్టి మిగిలిన కొద్దిమంది కూడా అటువైపే వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాను స్థాపించిన పార్టీ చేజారిపోవడం, కొడుకు చేతుల్లోకి వెళ్లిపోవడం లాంటి పరిణామాలను ములాయం ఎలా జీర్ణించుకుంటారో చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే అఖిలేష్ వర్గం ఆఫర్ చేస్తున్న 'మార్గదర్శి' పోస్టును తీసుకోవడం ఒక్కటే ములాయం ముందున్న పెద్ద ఆప్షన్. 
 
అఖిలేష్ జోరు
కాంగ్రెస్, ఆర్‌ఎల్డీ తదితర పార్టీలతో కలిసి మహాకూటమి ఏర్పాటుచేయాలని అఖిలేష్ వర్గం ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. ఇప్పుడు ఎటూ పార్టీ, గుర్తు కూడా తమకే వచ్చేశాయి కాబట్టి రెట్టించిన ఉత్సాహంతో పావులు కదుపుతున్నారు. ఎలాగైనా మరోసారి కూడా అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్నారు. ఢిల్లీ రాజకీయాల్లో ఆరితేరిన రాంగోపాల్ యాదవ్ అండదండలు ఉండటంతో అఖిలేష్ తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా తాను ప్రశాంత కిషోర్ లాంటి ఎన్నికల వ్యూహకర్తను పెట్టుకున్నా పెద్దగా ఫలితాలు వచ్చే సూచనలు కనిపించకపోవడంతో అఖిలేష్‌తో కలిసి వెళ్లే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
మరిన్ని వార్తలు