ముంబై గ్యాంగ్ రేప్: నాలుగో నిందితుడు అరెస్ట్

25 Aug, 2013 09:01 IST|Sakshi

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోటో జర్నలిస్ట్ సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించిన కేసులో మరో నిందితుడిని ఆదివారం ఆదుపులోకి తీసుకున్నట్లు నగర పోలీసు కమిషనర్ వెల్లడించారు. దాంతో పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుల సంఖ్య నాలుగుకు చేరిందని ఆయన తెలిపారు. మరో నిందితుని కోసం పోలీసు బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు చెప్పారు.

 

నిందితుల్లో చంద్‌బాబు సత్తార్ షేక్ అలియాస్ మహమ్మద్ అబ్దుల్ (19)ను పోలీసులు శుక్రవారమే అరెస్టు చేయగా, శనివారం మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా దక్షిణ ముంబైలోని అనేక ప్రాంతాలను పోలీసులు నిందితుని కోసం జల్లెడపడుతున్నట్లు వివరించారు. ఫోటో జర్నలిస్ట్పై సామూహిక అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో మహారాష్ట్ర హోంమంత్రి ఆర్‌ఆర్ పాటిల్ ఆ కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే.



నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన మహాలక్ష్మీ పరిసరాల్లోని శక్తిమీల్స్లో అసాంఘిక కార్యకలపాలపై కథనం కోసం విధినిర్వహాణలో భాగంగా సహాయకునితో కలసి ఫోటో జర్నలిస్ట్ అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడ కొంత మంది యువకులు ఫోటోలు తీయవద్దని బెదిరించారు. అనంతరం ఆమెపై దాడి చేయబోయారు. యువకుల ప్రయత్నాన్ని ఆమె సహాయకుడు అడ్డుకున్నాడు. దాంతో అతడిని తీవ్రంగా గాయపరిచి, కాళ్లు చేతులు కట్టేశారు.  ఫోటో జర్నలిస్ట్పై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన సంగతి తెలిసిందే. ఆమె ప్రస్తుతం జస్లోక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.

>
మరిన్ని వార్తలు