ముంబై అత్యాచారం: విచారణకు మీడియా కవరేజి వద్దన్నపోలీసులు

30 Aug, 2013 22:12 IST|Sakshi

దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో పట్టపగలే ఓ ఫొటో జర్నలిస్టుపై జరిగిన సామూహిక అత్యాచారం కేసును కోర్టులో విచారించే సమయంలో ఆ విచారణ వివరాలను మీడియా కవర్ చేయకుండా చూడాలంటూ కోర్టును ముంబై పోలీసులు కోరారు. ఈ విషయం బాగా సున్నితమైనది కాబట్టి, విచారణ సమయంలో జరిగే వివరాలు మీడియాలో ప్రచారం అయితే ఇబ్బందికరంగా ఉంటుందని, అందువల్ల ఈ విచారణ ప్రక్రియ మీడియాలో కవర్ కాకుండా చూడాలని ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు.

అయితే, అలాంటి ఉత్తర్వులేవీ తాను ఇవ్వలేనంటూ అదనపు మేజిస్ట్రేట్ యు. పడ్వాడ్ స్పష్టం చేశారు. కానీ, కోర్టు ఇంత స్పష్టంగా ఈ విషయంలో తన నిర్ణయం వెల్లడించినా, పోలీసులు మాత్రం కోర్టు హాల్లోకి ప్రవేశించకుండా విలేకరులను అడ్డుకున్నారు. ప్రాథమికంగా, కోర్టు ఉత్తర్వులు ఉండటం వల్లే లోనికి రానివ్వడం లేదని పోలీసులు విలేకరులకు చెప్పారు. కానీ తర్వాత అసలు విషయం చెబుతూ, ముంబై క్రైం బ్రాంచి పోలీసులు కోరడం వల్లనే అడ్డుకున్నట్లు తెలిపారు. పోలీసుల విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించిన తర్వాత విలేకరులను కోర్టు హాల్లోకి అనుమతించారు.

మరిన్ని వార్తలు