ప్రేమ జంటలపై పోలీసుల దాడులపై విచారణ

10 Aug, 2015 09:19 IST|Sakshi
ప్రేమ జంటలపై పోలీసుల దాడులపై విచారణ

ముంబయి: వాణిజ్య నగరంలో కలకలం సృష్టించిన ప్రేమికుల జంటలపై పోలీసుల దాడుల ఘటనపట్ల విచారణకు ఆదేశించారు. హోటళ్లు, రిసార్టులు, బీచ్లవద్ద దాడులు నిర్వహించి సరైన కారణాలు లేకుండా పోలీసులు ప్రేమికులను అరెస్టు చేశారని ఆరోపణలు రావడంతో ముంబయి పోలీస్ కమిషనర్ విచారణకు ఆదేశించారు. వెంటనే ఈ ఘటనకు సంబంధించి నిజనిజాలు నిగ్గు తేల్చి పోలీసులు తప్పు చేసినట్లు రుజువైతే తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అసభ్యంగా ప్రవర్తించారని స్థానికులు ఫిర్యాదులు చేశారంటూ ముంబయి పోలీసులు ప్రేమికులపై రెచ్చిపోయిన విషయం తెలిసిందే.

తామంతా మైనారిటీ తీరినవాళ్లమేనని, తమకు నచ్చిన వ్యక్తితో ఎక్కడో హోటల్ గదిలో తమకు ఇష్టం వచ్చినట్లు ఉంటే దానికి పోలీసులకు అభ్యంతరం ఎందుకని వారు ప్రశ్నించారు కూడా. అదేమీ బహిరంగ ప్రదేశం కాదుకదా అని కూడా పోలీసులను నిలదీశారు. పోలీసులు దాదాపు 40 వరకు జంటలను అరెస్టు చేయగా, వాళ్లలో చాలామంది విద్యార్థులు కూడా ఉన్నారు. వాళ్ల తల్లిదండ్రులకు ఫోన్లు వెళ్లాయి. ఒక్కొక్కరికి దాదాపు రూ. 1200 జరిమానా విధించారు.

ఈ ఘటనతో మనస్తాపం చెందిన 19 ఏళ్ల అమ్మాయి దాదాపు ఆత్మహత్య చేసుకున్నంత పని చేసింది. తమను ఎందుకు అరెస్టు చేస్తున్నారని అడిగినందుకు మరో 21 ఏళ్ల అమ్మాయిని లేడీ కానిస్టేబుల్ చెంపమీద కొట్టింది. తాను తన అసలు పేరు, గుర్తింపు ధ్రువపత్రాలు కూడా హోటల్లో ఇచ్చానని, అలాంటప్పుడు వాళ్లు తమను వ్యభిచారిణులుగా ఎందుకు చిత్రీకరించాలని ఆమె ప్రశ్నించింది. ఈ ఘటన ఇప్పుడు ముంబయిలో హాట్ టాఫిక్గా మారింది. ఓ హోటల్ రూంలో సీసీటీవీ ఫుటేజ్ చూడగా నేరుగా వచ్చిన పోలీసులు హోటల్ నిర్వాహకులను బయటకు పంపించి లోపలికి వెళ్లి బలవంతంగా జంటలను ఈడ్చుకొచ్చినట్లు కనిపించింది.

మరిన్ని వార్తలు