ముంబై సీపీ రాజీనామా.. రాజకీయ ప్రవేశం!

31 Jan, 2014 16:35 IST|Sakshi
ముంబై సీపీ రాజీనామా.. రాజకీయ ప్రవేశం!

ముంబై పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్ ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆయన త్వరలోనే రాజకీయాల్లో చేరే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ విషయంలో మహారాష్ట్ర హోం మంత్రి ఆర్ ఆర్ పాటిల్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 59 ఏళ్ల సత్యపాల్ సింగ్ గురువారం పొద్దుపోయాక మీడియాను కలిసి తాను రాజీనామా చేయదలచుకున్న విషయాన్ని వెల్లడించారు. బీజేపీ లేదా ఆమ్మ ఆద్మీ పార్టీ నుంచి లోక్ సభకు పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది.

ఒకవేళ రాజకీయాల్లో చేరకపోతే మాత్రం ఏదైనా అంతర్జాతీయ సంస్థలలో ఉద్యోగం చేసే అవకాశం కూడా లేకపోలేదు. అయితే తాను ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన వెల్లడించారు. గతంలో పుణె, నాగ్పూర్ నగరాలకు పోలీసు కమిషనర్గా చేసిన సత్యపాల్ సింగ్ ఈసారి ఆరు రాష్ట్రాలలో ఏదో ఒకదానికి డీజీపీ అవుతారని అంతా భావించారు. కానీ గత కొన్ని నెలలుగా ఆయన పదోన్నతిపై రాజకీయ మేఘాలు అలముకున్నాయి. 1980 బ్యాచ్కి చెందిన ఐపీఎస్ అధికారి అయిన సత్యపాల్, 2012 ఆగస్టులో ముంబై సీపీగా బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆయన సీబీఐలోనూ పనిచేశారు. తూర్పు మహారాష్ట్రలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండే గడ్చిరోలి జిల్లాలోనూ ఆయన కొన్నాళ్లు బాధ్యతలు నిర్వర్తించారు. రిటైర్మెంటు ఇంకా రెండు సంవత్సరాలు ఉండగానే ఆయన స్వచ్ఛంద పదవీ విరమణను ఎంచుకోవడం గమనార్హం. రసాయన శాస్త్రంలో పీజీ చేసిన ఆయన.. వేదాలు, ఆధ్యాత్మికత, యోగా, మేనేజ్మెంట్ నైపుణ్యాలపై పలు పుస్తకాలు కూడా రాశారు.

మరిన్ని వార్తలు