అనూహ్య వస్తువుల కోసం అన్వేషణ

7 Mar, 2014 00:25 IST|Sakshi
అనూహ్య వస్తువుల కోసం అన్వేషణ

సాక్షి, ముంబై: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనూహ్య హత్య కేసులో నిందితుడు చంద్రభాన్ సానప్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఇప్పుడు ఆమె వస్తువుల ఆచూకీని కనుగొనడంపై దృష్టి సారించారు. అనూహ్యను హత్యచేసిన తరువాత చంద్రభాన్ ఆమె ల్యాప్‌టాప్, బ్యాగును తీసుకుని వెళుతూ.. మార్గం మధ్యలో ల్యాప్‌టాప్‌ను కల్యాణ్-షాపూర్ రహదారిపై విసిరేశాడు.

బ్యాగును త్రయంబకేశ్వర్‌లో గుడి మెట్ల దగ్గర అడుక్కుంటున్న వృద్ధురాలికి ఇచ్చాడు. అనూహ్య బ్యాగును స్వాధీనం చేసుకున్నప్పటికీ.. అందులోని దుస్తులు లభించలేదు. దర్యాప్తులో భాగంగా ఆమె దుస్తులతోపాటు, ల్యాప్‌టాప్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు.. చంద్రభాన్ అనూహ్యను హత్యచేసిన తర్వాత ఆ విషయాన్ని తన భార్య, తల్లితోపాటు సన్నిహితులకు కూడా చెప్పినట్లు విచారణలో వెల్లడించాడు.

తాగిన మైకంలో అఘాయిత్యానికి పాల్పడ్డానని, ఇక నుంచి మద్యాన్ని ముట్టుకోనని... మంచి మనిషిగా బతుకుతానని భార్య, తల్లికి హామీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. మచిలీపట్నానికి చెందిన అనూహ్య ఈ ఏడాది జనవరిలో ముంబైలో హత్యకు గురికాగా, దాదాపు రెండు నెలల తర్వాత నిందితుడు చంద్రభాన్‌ను పోలీసులు కొన్ని రోజుల క్రితం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు