మిస్టరీగానే అనూహ్య హత్య

20 Jan, 2014 03:13 IST|Sakshi
మిస్టరీగానే అనూహ్య హత్య

దర్యాప్తులో కానరాని పురోగతి
ఒక్క ఆధారాన్నీ సేకరించని మహారాష్ట్ర పోలీసులు
అనూహ్య హత్యపై ఎన్నో సందేహాలు
ముంబైకి చేరిన రోజే హత్యకు గురైందన్న అనుమానాలు

 
 సాక్షి, ముంబై: ముంబైలో దారుణ హత్యకు గురైన కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఎస్తేర్ అనూహ్య(23) కేసులో ఇంతవరకూ ఎలాంటి పురోగతీ లేదు. ఈ వ్యవహారంలో మహారాష్ట్ర పోలీసులు ఎలాంటి ఆధారాలూ సంపాదించలేదు. దీంతో ఈహత్య ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. ఈ నెల 4న విజయవాడలో లోక్‌మాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరిన అనూహ్య.. 16న ముంబైలోని కంజూర్ మార్గ్-భాండూప్ మధ్యలో ఈస్టర్న్ ఎక్స్‌ప్రెస్ హైవే సర్వీస్ రోడ్డు పక్కన శవంగా కనిపించిన విషయం తెలిసిందే.అయితే, నాలుగురోజులు కావస్తున్నా పోలీసులు ఒక్క ఆధారాన్నీ సేకరించలేకపోయారు. దీంతో అనూహ్య కుటుంబీకులు ఆరోపిస్తున్నట్టుగా పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.
 
 కుర్లా-భాండూప్ మధ్యలోనే?: అనూహ్య హత్య కుర్లా-భాండూప్ మధ్యలోనే జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. విశాఖ నుంచి బయల్దేరిన అనూహ్య ఈ నెల 5న తెల్లవారుజామున 4.55 గంటలకు లోకమాన్య తిలక్ టెర్మినస్(ఎల్‌టీటీ)కుర్లాలో రైలు దిగింది. అక్కడి నుంచి ఏమైందనే విషయంపై ఇప్పటివరకు ఏ విధమైన వివరాలూ తెలియలేదు. అనూహ్య అంధేరీలో తానుంటున్న హాస్టల్‌కు వెళ్లేందుకు ఎప్పుడూ కుర్లా నుంచి ఘట్కోపర్ పవాయి మీదుగా వెళ్తుందని కుటుంబీకులు చెబుతున్నారు. ఎల్‌టీటీనుంచి ఆమె ఉండే హాస్టల్‌కు చేరుకోవాలంటే ఎటునుంచి వెళ్లినా 20 నుంచి 30 కిలోమీటర్లకు మించదు. అయితే ఆమె అంధేరీ చేరుకోకముందే మార్గమధ్యంలోనే శవంగా మారిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
 అదేరోజున హత్యకు గురైందా?: కాగా శవపరీక్షలు నిర్వహించిన జేజే ఆసుపత్రి డీన్ డాక్టర్ తాత్యా లహానే అనూహ్య మృతదేహం బాగా కుళ్లిపోయిందని తెలిపారు. ఆమె హత్యకు గురై ఎన్నిరోజులై ఉంటుందన్న విషయాన్ని ఆయన కచ్చితంగా చెప్పలేకపోయినా.. వారం పదిరోజులు అయిఉండే అవకాశాలను కాదనలేదు. అనూహ్య ముంబైకి చేరినరోజే హత్యకు గురై ఉంటుందన్న అనుమానాలకు ఇది బలం చేకూరేలా చేసింది. మరో విషయం ఏమిటంటే.. ఆమె రైల్వేస్టేషన్ నుంచి అంధేరీ వెళ్లేందుకు కుర్లా-భాండూప్ మార్గంలో వెళ్లవచ్చు.
 
 అయితే అంధేరీ వెళ్లేందుకు కంజూర్‌మార్గ్ వద్ద మలుపు తీసుకోవాల్సి ఉంది. కానీ ఆమె మృతదేహం భాండూప్ వెళ్లే మార్గంలో.. సర్వీస్ రోడ్డు పక్కన లభించింది. దీనినిబట్టి ఆమె ఎక్కిన ఆటో లేదా క్యాబ్ మలుపు తీసుకోకుండా భాండూప్ వైపునకు సాగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎల్‌టీటీ నుంచి ఆమె వెళ్లిన ఆటో లేదా క్యాబ్‌లోనివారు మార్గమధ్యలో ఆమెను హత్యచేసి అనంతరం అక్కడ పడేసి ఉండవచ్చని భావిస్తున్నారు. నిందితులు ఆమెను హత్య చేసిన అనంతరం తగులబెట్టి ఉండవచ్చని కుటుంబీకులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.
 
 ఇదేం దర్యాప్తు: అనూహ్య కన్పించకుండా పోయినప్పటినుంచి ఇటు రైల్వే, అటు మహారాష్ట్ర పోలీసుల దర్యాప్తుపై అనూహ్య కుటుంబీకులు తీవ్ర నిరసన వ్యక్తంచేస్తున్నారు. పోలీసుల దర్యాప్తు సంతృప్తికరంగా లేదని ముంబైలో ఉంటున్న అనూహ్య బంధువు సునీత ‘సాక్షి’కి తెలిపారు.  ‘‘ఈ నెల ఐదవ తేదీ తెల్లవారుజామున 4.55 గంటల సమయంలో రైల్వేస్టేషన్‌లో దిగినమాట వాస్తవమైనప్పటికీ దర్యాప్తు సక్రమంగా ఎందుకు కొనసాగడంలేదు?. అనూహ్య కన్పించడంలేదని ఫిర్యాదు అందగానే ఈ విషయాన్ని ఇతర పోలీస్‌స్టేషన్లకు పోలీసులు ఎందుకు తెలుపలేదు?’’ అని ఆమె ప్రశ్నించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ సీసీటీవీలోనూ ఆధారాలు లభించడంలేదా? అని నిలదీశారు.   
 
 మృతదేహం అనూహ్యదేనా?: గుర్తుపట్టలేని స్థితిలో లభించిన యువతి మృతదేహం అసలు అనూహ్యదేనా? అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఆమె బంధువు సునీత మాట్లాడుతూ అనూహ్య కోసం వెదుకుతున్న సమయంలో తమకు గుర్తుపట్టలేని స్థితిలో మహిళ శవం లభించిందని, ఆమె వేలుకున్న ఉంగరాన్నిబట్టి అనూహ్య అనినిర్ధారణకు వచ్చామని, నిందితులు ఆ శవానికి అనూహ్య ఉంగరం తొడిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. డీఎన్‌ఏ పరీక్షల అనంతరమే అన్ని విషయాలూ తెలుస్తాయన్నారు.
 
 అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది..
  అనూహ్య కేసుకు సంబంధించి అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొంటున్నారు. దీనిపై భాండూప్ ఏసీపీ శేజ్వాల్‌ను ‘సాక్షి’ ప్రశ్నించగా.. దర్యాప్తు కొనసాగుతోందని మాత్రమే తెలిపారు.  అన్ని వివరాలు తొందర్లోనే తెలుపుతామని చెప్పారు.
 
 అండగా ఉంటాం: వైఎస్ విజయమ్మ
 మచిలీపట్నం, న్యూస్‌లైన్: అనూహ్య తండ్రి ప్రసాద్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆదివారం ఫోన్‌లో పరామర్శించారు. ఘటన వివరాలను ప్రసాద్‌నడిగి తెలుసుకున్నారు. ‘మీ కుటుంబానికి అండగా ఉంటాం’ అని ఆయనకు భరోసా ఇచ్చారు. న్యాయం జరిగేవరకూ వైఎస్సార్‌సీపీ తరఫున పోరాటం చేస్తామని హామీఇచ్చారు.  
 
 అనూహ్య తండ్రికి సీఎం పరామర్శ
 అనూహ్య తండ్రి ప్రసాద్‌ను ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదివారం ఫోన్‌లో పరామర్శించారు. మంత్రి పార్థసారథి   సీఎంకు ఫోన్‌చేసి ప్రసాద్‌తో మాట్లాడాలని కోరగా.. ఆయన  ఫోన్‌లో అనూహ్య తండ్రిని పరామర్శించారు. మహారాష్ట్ర సీఎంతో స్వయంగా మాట్లాడానని, అనూహ్య కేసును త్వరితగతిన పరిష్కరించాలని కోరానని కిరణ్ చెప్పారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా