ప్రముఖ సంగీత దర్శకుడు దక్షిణామూర్తి కన్నుమూత

2 Aug, 2013 23:00 IST|Sakshi

పలు దక్షిణాది భాషల్లో గత ఏడు దశాబ్దాలుగా వందలాది పాటలకు బాణీలు అందించిన ప్రముఖ సంగీత దర్శకుడు వి.దక్షిణామూర్తి శుక్రవారం చెన్నైలో మరణించారు. 94 సంవత్సరాల దక్షిణామూర్తి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చెన్నై మైలాపూర్లోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. సినీ రంగంలో 'స్వామి' పేరుతో సుప్రసిద్ధుడైన ఆయన.. అద్భుతమైన క్లాసికల్ టచ్తో పాటలకు సంగీతం సమకూర్చారు. కె.జె. ఏసుదాసు, పి.సుశీల, పి.లీల, జయచంద్రన్ తదితర ప్రముఖ గాయకులంతా ఆయన పాటలు పాడి పెద్దవాళ్లయినవారే.

1950ల ముందువరకు హిందీ, తమిళ పాటలను కాపీ కొడుతూ వచ్చిన మళయాళ సినీ పరిశ్రమలో తొలిసారి అసలు బాణీలను సమకూర్చిన ఘనత దక్షిణామూర్తిదే. స్వతహాగా కర్ణాటక గాయకుడైన ఆయన.. తన పాటల్లో ఆ సంగీతంతో పాటు జానపదానికీ పెద్దపీట వేశారు. ఒకే పాటలో పలు రాగాలను సమకూర్చి సరికొత్త ప్రయోగాలు చేసేవారు.

కేరళలోని అళప్పుళ జిల్లాలో వెంకటేశ్వర అయ్యర్, పార్వతీ అమ్మాళ్ దంపతులకు పుట్టిన ఆయన.. తన తల్లి వద్దే సంగీతంలో ఓనమాలు దిద్దారు. చంద్రిక చిత్రంలో (1950) తొలిసారి పాటలు సమకూర్చారు. భార్యమార్ సూక్షికువ, కన్నూర్ డీలక్స్, మరునత్తిల్ ఒరు మళయాళీ తదితర చిత్రాలతో ఆయనేంటో మళయాళ చిత్ర దర్శకులకు తెలిసింది. అప్పటివరకు బలవంతంగా ఆయనతో తమిళ, హిందీ పాటలను కాపీ చేయించిన వారు ఆ తర్వాత ఆయన సొంత బాణీలనే కట్టించుకున్నారు.

మరిన్ని వార్తలు