ప్రధాని మోదీపై విరుచుకుపడిన ముస్లిం లా బోర్డ్‌!

13 Oct, 2016 21:06 IST|Sakshi
  • ఉమ్మడి పౌరస్మృతిపై ముస్లిం పర్సనల్‌ లా బోర్డు మండిపాటు
  •  

    న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై దేశంలోని అత్యున్నత ముస్లిం సంస్థ ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు భగ్గుమంది. ఇస్లామిక్ చట్టాన్ని రద్దుచేసి.. ఆ స్థానంలో ఉమ్మడి పౌరస్మృతిని తేవడానికి, దేశంలోని విభిన్న సంస్కృతులను ధ్వంసం చేయడానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని విరుచుకుపడింది.

    ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) విషయంలో ప్రజాభిప్రాయాన్ని కోరుతూ కేంద్ర న్యాయశాఖ రూపొందించిన ప్రశ్నావళిని లాబోర్డ్‌ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. దేశంలోని బహుళ సంస్కృతిని ప్రభుత్వం గౌరవించాలని సూచించింది. 'మోదీ దేశంలో అంతర్యుద్ధాన్ని సృష్టించాలని చూస్తున్నారు. ముస్లింలదరూ దీనిపై పెద్దసంఖ్యలో స్పందిస్తారు. భారత్‌లో ఒకే భావజాలాన్ని రుద్దలేరు' అని ముస్లిం లా బోర్డు పేర్కొంది.

    ముస్లిం ప్రజల్లోని ట్రిపుల్‌ తలాక్‌, బహుభార్యత్వం వంటి సంప్రదాయాలను తాము వ్యతిరేకిస్తున్నామని, రాజ్యాంగం మౌలిక లక్షణమైన లింగ సమనత్వం విషయంలో ఎలాంటి సంప్రదింపులకు తావులేదని సుప్రీంకోర్టుకు గతవారం కేంద్రం తెలిపిన సంగతి తెలిసిందే. ఇస్లామిక్‌ చట్టమైన షరియా ప్రకారం ఒక ముస్లిం వ్యక్తి తన భార్యకు మూడుసార్లు 'తలాక్‌' అని చెప్పడం ద్వారా విడాకులు ఇవ్వొచ్చు. అంతేకాకుండా ముస్లిం వ్యక్తి నలుగురు భార్యలను కలిగి ఉండవచ్చు. అయితే, ఈ విధానాలు స్త్రీల పట్ల వివక్ష చూపడమేనని ముస్లిం మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ వివాదాస్పద అంశాలపై తొలిసారి కేంద్రం తన వైఖరిని వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే దేశమంతటా ఒకే చట్టబద్ధమైన విధానం ఉండేలా ఉమ్మడి పౌరస్మృతిపై ప్రజాభిప్రాయాన్ని కోరుతూ కేంద్ర న్యాయశాఖ ప్రశ్నావళిని రూపొందించిదన్న వార్తలపై ముస్లిం లా బోర్డ్‌ భగ్గుమంటోంది. త్రిపుల్‌ తలాక్‌ ఉండాల్సిందేనని, ఉమ్మడి పౌరస్మృతి ప్రమాదకరమని పేర్కొంటున్నది.

మరిన్ని వార్తలు