అనాథలుగా అన్నదాతల పిల్లలు

20 Jul, 2017 02:35 IST|Sakshi
అనాథలుగా అన్నదాతల పిల్లలు

శాపంగా మారుతున్న రైతుల ఆత్మహత్యలు
న్యూఢిల్లీ: ‘మా నాన్నకు అరటి తోట ఉండేది. రేయింబవళ్లు శ్రమించి పండించిన పంటకు మద్దతు ధర కూడా లభించక నష్టం వచ్చింది. ప్రజలు రైతుల దగ్గర చిల్లర మొత్తాలకు బేరమాడతారు. దళారులు, మధ్యవర్తులు వారిని మోసం చేస్తారు. అప్పులు కట్టమంటూ బ్యాంకులు నెత్తిన కూర్చుం టాయి. ఇవన్నీ భరించలేక రైతు ఆత్మహత్య చేసుకుంటాడు. మా నాన్నా అదే చేశాడు. అప్పుడు నాకు మూడేళ్లు. మా నాన్న తీసుకున్న నిర్ణయం ఆయనను బాధల నుంచి విముక్తుడిని చేసి ఉండొచ్చు. కానీ మా కుటుంబ పరిస్థితిని దారుణంగా మార్చింది. మా బతుకు మేం బతకాల్సి వచ్చింది.

 కాబట్టి నా సందేశమేంటంటే...’ అంటూ మాట్లాడుతూనే పల్లవి పవార్‌ అనే 14 ఏళ్ల అమ్మాయి వేదికపైనే బోరున ఏడ్చేసింది. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నాక వారి పిల్లల పరిస్థితి ఏంటనేది ఈ అమ్మాయి మాటలు కళ్లకు కడుతున్నాయి. మహారాష్ట్రలో రైతులు బల వంతంగా తమ జీవితం ముగించాక, వారి బిడ్డలు అనాథ శరణాలయాల్లో చేరుతున్నారు. ఆ రాష్ట్రంలో 162 సంస్థలు కలిసి ‘కిసాన్‌ ముక్తి యాత్ర’ పేరుతో రైతు ఉద్యమాన్ని చేపట్టాయి. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల పిల్లల దుర్భర పరిస్థితులను ప్రపంచానికి చెప్పేందుకు 400 మందిని ఢిల్లీకి తెచ్చి ఓ సదస్సు పెట్టి వారితో మాట్లాడించాయి.

 పిల్లలంతా నాసిక్‌ జిల్లాలోని ఓ దాతృత్వ సంస్థ ఏర్పాటు చేసిన శరణా లయంలో ఉంటూ చదువుకుంటున్నారు. వీరిలో మూడు, నాలుగేళ్ల వయసున్న పిల్లలూ చాలా మంది ఉన్నారు. స్వరాజ్‌ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన అనుపమ్‌ మాట్లాడుతూ ‘రైతులు రోడ్లపైకి వస్తే పట్టణ జనాభాకు అది ట్రాఫిక్‌ సమస్య. ఈ పిల్లలను ఢిల్లీకి తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల్లోని దుర్గతులను చూపించి ఇక్కడివారి మానవీయతను మేల్కొలపాలనుకున్నాం. ఈ చిన్నారుల బాధలు వారిని చలించేలా చేయకపోతే..ఇంకేదీ ఆ పని చేయలేదు’ అని అన్నారు

. శరణాలయ నిర్వాహకులు మాట్లాడుతూ ‘పిల్లలు నాలుగు కిలో మీటర్ల దూరంలోని ప్రభుత్వ పాఠశాలకు నడచుకుంటూ వెళ్లి చదువుకుంటారు. ప్రస్తుతం ఇక్కడ 400 మంది ఉన్నారు. మరింత మందిని చేర్చుకోమని మాపై ఒత్తిడి పెరుగుతోంది. 1,800 మంది ఇలాంటి పిల్లలు శరణాలయంలో చేరడానికి నిరీక్షణ జాబితాలో ఉన్నారు. ఈ సంఖ్యలే మహారాష్ట్రలోని రైతు కష్టాలకు అద్దం పడుతున్నాయి’ అని చెప్పారు.
 

మరిన్ని వార్తలు