నా మతంతో నీకేం పని?: సీజేఐ

20 Nov, 2016 18:01 IST|Sakshi
నా మతంతో నీకేం పని?: సీజేఐ

దేవుడు-మనిషికి మధ్య సంబంధం వ్యక్తిగతం

న్యూఢిల్లీ: మనిషికి దేవుడికి మధ్య సంబంధం చాలా వ్యక్తిగతమైనదని, దాని గురించి ఇతరులకు పట్టింపు ఉండకూడదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌ పేర్కొన్నారు. సమాజంలో శాంతికి సహనమే కీలకమని ఆయన నొక్కిచెప్పారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రోహింటన్ ఎఫ్‌ నారీమన్‌ జోరాష్ట్రీయనిజం మీద రాసిన పుస్తకం ‘ద ఇన్నర్‌ ఫైర్‌, ఫెయిత్‌, చాయిస్‌ అండ్‌ మోడ్రన్‌ డే లివింగ్‌ ఇన్‌ జోరాష్ట్రీయనిజం’ (The Inner Fire, faith, choice and modern-day living in Zoroastrianism)ను  జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మతం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

రాజకీయ భావజాలాల కన్నా మతయుద్ధాల్లోనే ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. మతవిశ్వాసాల పేరిట ఈ భూమండలంలో ఎంతో విధ్వంసం, వినాశనం, రక్తపాతం చోటుచేసుకున్నాయని చెప్పారు. ‘నా మతం ఏమిటి? ఎలా నేను నా దేవుడితో అనుసంధానం అవుతాను? నా దేవుడితో నాకు ఎలాంటి సంబంధం ఉంది? అన్నది ఇతరులకు అవసరంలేని విషయం. మీరు మీ దేవుడితో ఎలా  ఉండదలుచుకుంటే అలా ఉండొచ్చు’ అని అన్నారు.

మనిషికి దేవుడికి మధ్య సంబంధం చాలా వ్యక్తిగతమైనది. దానికి ఇతరులతో ఏం సంబంధం ఉండదని సీజేఐ స్పష్టం చేశారు. ‘సోదరభావం, సహనం, అన్ని మార్గాలు ఒకే మార్గానికి ప్రయాణించి ఒకే దేవుడిని చేరుకుంటాయన్న ఆమోదనీయ భావం ప్రపంచాన్ని శాంతియుతంగా మారుస్తాయి. సుసంపన్నం చేస్తాయి. ఈ విషయంలో రోహింటన్‌ గొప్ప కృషి చేశారు’ అని జస్టిస్‌ ఠాకూర్‌ కొనియాడారు.  
 

మరిన్ని వార్తలు