400 ఏళ్ల శాపం.. ఇక విమోచనం..

17 Jun, 2017 10:46 IST|Sakshi
400 ఏళ్ల శాపం.. ఇక విమోచనం..

మైసూరు: పెద్ద రాజ్యం..అంగ, అర్ధబలం, ఇంద్రభోగాలు.. అన్నీ ఉన్నాయి... సంతాన భాగ్యమే లేదు. లంకంత ప్యాలెస్‌ చిన్నారి అల్లరి లేక బోసిపోయేది. రాజ దంపతులు ఎన్ని నోములు వ్రతాలు చేసినా దైవం కరుణించలేదు. మైసూరు మహారాజుల వ్యక్తిగత జీవితంలో ఇదో దుర్భర వేదన. చివరికి వారిపై భగవంతుడు దయచూపాడు. 400 ఏళ్ల ఎదురుచూపులకు తెరదించాడు. రాచనగరిలో ఈ యేడాది జరిగే దసరా వేడుకల నాటికి మైసూరు మహారాజుల వంశంలో మరో బుల్లి మహారాజు వేంచేయబోతున్నట్లు తెలిసింది.

 దీంతో మైసూరు రాజవంశీకుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. మైసూరు రాజవంశీకుడు యదువీర్‌ కృష్ణదత్త చామరాజ ఒడెయర్, త్రిషిక కుమారి దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. గతేడాది జూన్‌ 27న అంగరంగ వైభవంగా సాగిన వివాహమహోత్సవంలో వీరు ఒక్కటైన సంగతి తెలిసిందే. దివంగత శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడెయర్‌– రాణి ప్రమోదాదేవికి యదువీర్‌ దత్త పుత్రుడు. త్రిషిక ఐదు నెలల గర్భిణి. దీంతో రాజమాత ప్రమోదాదేవి, రాజ కుటుంబం ఆనందంలో వెల్లివిరుస్తోంది.

అలమేలమ్మ శాపం..
చరిత్ర చెబుతున్న కథనాల ప్రకారం మైసూరు మహారాజులకు పిల్లలు కలగలేదు. నాలుగు వందల ఏళ్ల కిందట శ్రీరంగపట్టణం రాజు శ్రీరంగరాయన (తిరుమలరాజ) భార్య అలమేలమ్మ శాపం వారికి ఉండటంతో మైసూరు సింహాసనాధీశులకు అన్ని సంపదలు ఉన్నా, సంతానభాగ్యం మాత్రం లేకుండా పోతోంది. క్రీ.శ. 1612లో తిరుమలరాజ మైసూరు సింహాసనం ఏలుతుండగా, రాజ ఒడెయర్‌ ఆయనపై తిరుగుబాటు చేసి రాజవుతాడు. దీంతో ఆవేదనకు గురైన తిరుమలరాజ భార్య అలమేలమ్మ కొన్ని ముఖ్యమైన ఆభరణాలను తీసుకుని తలకాడుకు వెళ్లిపోతుంది. ఆమెను వెతుక్కుంటూ వచ్చిన ఒడెయర్‌ సైనికులు ఆమెను చుట్టుముడతారు.

 ఆ సమయంలో అలమేలమ్మ తీవ్ర ఆగ్రహంతో... మైసూరు రాజులకు ఎప్పటికీ కడుపు పండదని శపించి కావేరి నదిలో దూకి తనువు చాలిస్తుంది. ఆమె శాపం మహత్యమో, లేక మరే కారణమో గానీ అప్పటి నుంచి మొన్నటి శ్రీకంఠదత్త ఒడెయర్‌ వరకు మైసూరు రాజులు నిస్సంతులే. దీంతో సమీప బంధువుల్లోని మగపిల్లల్ని దత్తత తీసుకుని వారసు నిగా ప్రకటిస్తున్నారు. చరిత్రకు భిన్నంగా ఈసారి రాజ దంపతుల కడుపు పండింది. మగపిల్లాడు పుడతాడని మైసూరు ప్యాలెస్‌ జ్యోతిష్యులు చెప్పినట్లు ప్రచారం సాగుతోంది.