పెద్దనోట్ల రద్దుపై మెగా బ్రదర్‌ బోల్డ్‌ కామెంట్‌‌!

21 Nov, 2016 11:26 IST|Sakshi
పెద్దనోట్ల రద్దుపై మెగా బ్రదర్‌ కామెంట్‌‌!

హైదరాబాద్‌: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దుపై ప్రముఖ నటుడు, మెగా సోదరుడు నాగాబాబు స్పందించారు. ఇంచుమించు 70 ఏళ్ల తర్వాత ఈ దేశం బాగుపడటానికి తీసుకున్న అద్భుత నిర్ణయం పెద్దనోట్ల రద్దు అని కొనియాడారు. ఈ మేరకు తన అభిప్రాయాలతో కూడిన వీడియో ఇంటర్వ్యూను యూట్యూబ్‌లో పెట్టారు. తాను మోదీ అభిమానిని కాదని, కనీసం బీజేపీ సభ్యుడిని కూడా కాదని, బీజేపీతో తనకు అభిప్రాయభేదాలు ఉన్నాయని పేర్కొన్నారు. అన్నయ్య చిరంజీవి కాంగ్రెస్‌ పార్టీలో చేరడంతో తాను కూడా ప్రాథమికంగా కాంగ్రెస్‌ సభ్యుడినేనని, అయినా ప్రతివిషయంలో ప్రధాని మోదీని అర్జెంట్‌గా విమర్శించాలని తనకు లేదని అన్నారు. ఎవరూ మంచిపని చేసినా అభినందిస్తానని పేర్కొన్నారు.

భారతదేశానికి ప్రస్తుతం స్వాతంత్ర్యం మరి ఎక్కువైపోయిందని, ఇలాంటి సమయంలో నియంతలాంటి నేత దేశానికి అవసరముందని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యం నుంచి మంచి మనస్సుతో కఠినమైన నిర్ణయాలు తీసుకొనే నేత రావాలని తాను చిన్నప్పటి నుంచి అనుకునేవాడినని, మోదీ రాకతో అది నెరవేరిందన్నారు. పెద్దనోట్లను రద్దుచేస్తూ మోదీ తీసుకున్న నిర్ణయంతో తాను కూడా షాక్‌ అయ్యానని, అయితే దీని గురించి ఆలోచిస్తే ఇది మంచి నిర్ణయమో తెలిసిందని పేర్కొన్నారు.

ఈ విషయంలో కూడా లబ్ధి పొందాలని చూస్తున్న వెధవలు ఉన్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. గతంలో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ భరించిన వారు.. ఈ నాలుగైదు రోజుల కష్టాన్నీ భరించలేరా? అని పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దుపై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ ‘ఇలాంటి తాటాకు చప్పుళ్లేకు బెదిరే వ్యక్తి కాదు మోదీ.. చావో-రేవో తేల్చుకునే దమ్మున్న మగోడు’ అని పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దుతో సామాన్యులు కష్టాలు పడుతున్న సంగతి నిజమేనని, కానీ ప్రధాని మోదీ చెప్పినట్టు ఆయనకు 50 రోజులు ఇచ్చి చూడాలని, మంచిరోజులు వస్తాయని అన్నారు.